ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– రాష్ట్రసర్కారును డిమాండ్‌ చేసిన ఎంపీ లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1.27 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఎన్ని కంపెనీలు, ఎన్ని ఉద్యోగాలొచ్చాయని నిలదీశారు. దానిపేరుతో బినామీలకు, బంధువులకు భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. కుల, చేతివృత్తులకు సహాయం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలిచ్చి బీసీలను మోసం చేయచూస్తున్నదని విమర్శించారు. బతుకుమ్మ చీరలను గుజరాత్‌ నుంచి తెప్పించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. మోడీ విజన్‌ ఉన్న లీడర్‌ అనీ, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే మేలు జరుగుతుందన్నారు.