విద్యుద్ఘాతానికి గురై యువకుడు మృతి

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన
నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని రావిచేడ్‌ గ్రామంలో సోమవారం విద్యుద్ఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన రైతు మహమ్మద్‌ ఆరీఫ్‌ చిన్న కుమారుడు మహమ్మద్‌ జహంగీర్‌ (25) డిగ్రీ వరకు ఉన్నత విద్యను అభ్యసించి తన తండ్రికి సహాయంగా వారికి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో పొలంలో పశువులను మేపుతున్న జహంగీర్‌ సమీపంలోని విద్యుత్‌ స్తంభానికి ఉన్న సపోర్టు తీగ తగిలి విద్యుత్‌ ఘాతానికి గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ జహంగీర్‌ మృత దేహాంతో స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా సపోర్టు వైర్లకు తగిలి పాడి పశువులు విద్యుత్‌ ఘాతానికి గురై మృత్యువాత పడిన విద్యుత్‌ అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్‌ భారతమ్మ విఠలయ్య గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్‌ తదితరులు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా విద్యుత్‌ అధికారులు ఆందోళన కారులను శాంతిపచేసి ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరిశంకర్‌ గౌడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.