పెండ్లికి నిరాకరించిందని.. సాప్ట్‌వేర్‌ యువతిపై కత్తితో దాడి

 నార్సింగిలో ఘటన
నవతెలంగాణ-గండిపేట్‌
రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెండ్లికి ఒప్పుకో లేదని సాప్ట్‌వేర్‌ యువతిపై యువ కుడు కత్తితో దాడి చేశాడు. నార్సింగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గ్రామానికి చెందిన వాసవి నగరంలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌గా పనిచేస్తోంది. గచ్చిబౌలి ప్రాంతా నికే చెందిన గణేష్‌ జొమాటోలో డెలివరీ బారుగా పనిచేస్తున్నాడు. వీరిద్ద రూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తనను పెండ్లి చేసు కోవాలని గణేష్‌ ప్రతిపాదించగా వాసవి సున్నితంగా తిరస్కరించింది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటోంది. గణేష్‌ మంగళవారం రాత్రి మాట్లాడుకుందామని చెప్పి వాసవిని నార్సింగ్‌లోని ఓ హౌటల్‌కు తీసుకొచ్చాడు. అక్కడ మళ్లీ గణేష్‌ పెండ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆమె తిరస్కరించింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంతలోనే తనతో పాటు బ్యాగులో తీసుకువచ్చిన కత్తితో వాసవిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.