ఆబాద్‌ దిల్‌ కవిత్వం ‘మళ్లీ మనిషిలోకి’

Abad Dil's Poetry 'Back to Man'కరోనానంతర కాలంలో కవులు మరింత మానవీయులుగా మారిండ్రు. సాటి మనుషుల బాధలపట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. ఘర్షణ వైఖరి విడనాడి ప్రేమాస్పదంగా ఆదరిస్తున్నారు. గాయపడే హృదయాలకు అక్షర లేపనాలు రుద్దుతున్నరు. తాత్విక చింతనతో సమస్యకు పరిష్కారం వెతుకుతున్నారు. గతంలో మాదిరిగా రోడ్డు మీదికి వచ్చి ఉద్యమాలు చేసే స్థితి లేదు కాబట్టి అనునయం ద్వారానే ఒంటరిగా మిగిలిన వ్యక్తులను సమూహంలో భాగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను ఒక్కతాటిపైకి తెస్తున్నరు. పాలకులు మొండిగా వ్యవహరిస్తున్నా సంయమనం కోల్పోకుండా ప్రతిస్పందిస్తున్నారు. ఇట్లాంటి స్పందనే సమకాలీన సమాజం పట్ల ఉదారి నారాయణ తన ‘మళ్లీ మనిషిలోకి’ కవితా సంపుటి ద్వారా వ్యక్తం చేశారు. దు:ఖం, బాధ, ధిక్కారం, ఘర్షణ, ఆవేశం, ఆత్మీయత, ప్రేమ అన్నీ ఈ మనిషిలో గూడుకట్టుకొని ఉన్నాయి. మనిషితనం మీద మమకారం పెంచుకున్నాడు. మనలో మనకు ఎన్ని తేడాలున్నా మనం మనుషులం రా అంటూ గాఢాలింగనం చేసుకున్నాడు. అక్షర నెమలీకలతో గతకాలపు గాయాలను మాన్చే ప్రయత్నం చేసిండు.
గుండెలోని తడిని, పేగు బంధాన్ని, కరోనా కాలపు దైన్యాన్ని, ధైర్యాన్ని, పాలకుల పీడనను, మానవీయ మనుషుల పట్ల ఆర్ధ్రతను అక్షరాల్లోకి ఒంపిన ఉదారి నారాయణ కవిత్వ సంపుటి ‘మళ్లీ మనిషిలోకి’. 58 కవితల ఈ సంపుటిలో కరోనా కాలం నాటి వెతలతో పాటుగా అదే సమయంలో చనిపోయిన ఉ.సా., బాల సుబ్రహ్మణ్యం, స్టాన్‌స్వామిలపై స్మృతి కవితలున్నాయి. హత్యకు గురైన అడ్వకేట్‌ వామనరావు దంపతులపై కూడా కవితున్నది. అంతేకాదు సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాడు. రైతు కష్టాన్ని కైగడుతూనే, వారి పట్ల కేంద్ర ప్రభుత్వ అమానుష వైఖరిని ఎండగట్టిండు. తెలంగాణానంతర స్థితిపై ధిక్కారాన్ని వినిపించిండు. ఊటబాయి, నీళ్లపంక, జామచెట్టు, ఆదిలాబాదు నిషాని మోదుగు చెట్టు, తాను పనిచేసిన ఊరి జ్ఞాపకాలను, చదువుకున్న ఆర్ట్స్‌ కాలేజీ యాదిని ‘నోస్టాల్జిక్‌’గా రికార్డు చేసిండు. మారుతున్న గ్రామీణ సంస్కృతిని, గాయపడుతున్న ప్రజాస్వామిక విలువలనూ అక్షరబద్ధం చేసిండు. ‘పెద్ద దర్వాజ’ పేరిట నాయినను, ‘పెత్రమాస’ శీర్షికన తరాలనాటి పెద్దలను యాద్జేసుకొని అంజలి ఘటించిండు. ‘లేబర్‌ చౌక్‌’ పేరుతో ఏ పూటకాపూట పనిదొరికితేగాని తిండి ఉండని కార్మికుల గురించి, ఆదిలాబాద్‌ ఆదివాసీల ప్రేమను పరిచయం చేసిండు. తత్త్వకవి తండ్రి ఉదారి నాగదాసు నుంచి అలవరుచుకున్న మనుషులపట్ల ప్రేమను పెంచి, బాధను పంచుకునే తాత్వికతను, అలయి బలయి సంస్కృతిని నిఖార్సయిన తెలంగాణ భాషలో ఉర్దూ మిశ్రమంతో కైగట్టిండు ఉదారి నారాయణ. ఇప్పటికే తెలంగాణ ముద్రతో ‘ఆకుపచ్చని ఎడారి’, ‘యాల్లైంది’, ‘మాగిపొద్దు’ పేరిట కవితా సంపుటాలు, ‘ఆదిలాబాద్‌ నానీలు’, ‘ఎల్గడి’, ‘ఇప్పగాలి’ పేరిట ఆదిలాబాద్‌ జిల్లా కవితా సంకలనాలను వెలువరించాడు. సమకాలీన సమాజాన్ని, మారుతున్న బతుకులని, ఎక్కువవుతున్న రైతుల వెతలను ‘మళ్లీ మనిషిలోకి’ కవిత్వీకరించాడు ఉదారి.
ఇవ్వాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల మొండిగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యమకారుల్ని చెరబడుతున్నాయి, హక్కులను హరిస్తున్నాయి. పౌరసత్వం చట్టం, వ్యవసాయ చట్టాల పేరిట ప్రజలను, రైతులను వీధుల్లోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టిండు. ఆ ప్రతిస్పందనే ఉదారి నారాయణను ఇట్లా రాయించింది.
”సాలు సాలుకు చావుతో/ సహజీవనం చేస్తూ అందరి కండ్లలో/ పచ్చదనాన్ని మొలిపిస్తున్న కష్టజీవిని/ టియర్‌ గ్యాస్‌తో తోలు వొలిచినోళ్ళకు/ చేతులెట్లా వచ్చాయో…/ నేను మట్టిమనిషిని కాబట్టి” అంటూ తన బాధ్యతను బహిరంగంగా వ్యక్తం చేసిండు. పోరాటం చేస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించాడు. ‘అనేకాలుగా నేను’ అంటూ తన వివిధ అస్తిత్వాలను లెక్కగట్టిండు. కులవృత్తులు చేసే మనుషుల్లో నేనుంటాను అని చెప్పిండు. అంతేగాదు ఇదే కవితలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ధిక్కరిస్తూ
”రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ పఠిస్తూ/ జీవిస్తున్నవాణ్ణి/ రాజ్యాంగ శిల్పిని రోజూ/ చేతులెత్తి స్మరించుకునెటోన్ని” అని తెగేసి చెప్పిండు. అంబేడ్కరైట్‌ ఉద్యమాలతో మమేకమయిండు. స్టాన్‌స్వామి నిర్బంధం, కశ్మీర్‌లో పసిపాప ‘అసిఫా’ అత్యాచారంపై కవిత్వమల్లిండు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మమేకమైన వాడు కావడంతో తొలి దశలో తెలంగాణ ప్రభుత్వానికి హితబోధ చేసే విధంగా సహనముండాలి, పాలకులకు సమయమివ్వాలి అన్నట్టుగా 2016లో ఇట్లా రాసిండు.
”అరవై ఏండ్ల నిర్లక్ష్యపు శిల్పాన్ని/ సమ్మెట పోట్లతో బాధించొద్దు/ కొత్త ఉలితో జీవం పోయాలి/ నిస్సారపు నదుల నరాలకు” అని ఆశించిండు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు బాసటగా నిలవాలని సంయమనంతో ఉండాలని, సమయమివ్వాలని వాదించిండు. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వం తాను చేయాల్సిన పనిని పట్టించుకోక పోవడంతో విమర్శించిండు.
బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల వచ్చే నష్టాన్ని అడ్డుకునేందుకు పంజాబ్‌ రైతులు రహదారులను దిగ్బంధం చేసిండ్రు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఉదారి కవిత్వం రాసిండు. అంతేగాదు దేశమంతటా రైతులు మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకొని పడుతున్న ఇబ్బందులనూ కైగట్టిండు.
”మూలకు మూలుగుతున్న/ కర్రూ ముల్లుగర్రా/ అరకా అంబలి కుండని/ అసాంతం అలుముకొని” అని వ్యవసాయం మిగులుస్తున్న ఆత్మహత్యలను అక్షరబద్ధం చేసిండు.
ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతుండగానే కరోనా బారిన పడి జనులు తల్లడమల్లడమైతున్న తీరుని, లాక్‌డౌన్‌లో అతలా కుతలమైన జీవితాలను, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను బ్రతికించిన డాక్టర్లు, నర్సులు, సఫాయి కార్మికుల గురించి ఇందులో పదివరకు కవితలున్నాయి. కరోనా కాలములో ఆకలి కేకలు పెట్టిన ప్రయివేటు టీచర్ల దయనీయ స్థితిని, అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల వందల వేల మైళ్లు నడిచి రక్తాలోడిన మనుషుల గురించి మదనపడుతూ కవిత్వమల్లిండు. ఆత్మహత్యలను ఖండించిండు. వారిలో భరోసా నింపే కవిత్వం రాసిండు.
ఇంతకుముందు ప్రస్తావించిన ‘అనేకాలుగా నేను’ కవితలో బహుజన జీవితాన్ని కూడా ఆర్ద్రంగా చిత్రించిండు. గ్రామంలో శ్రమజీవులు, వృత్తికులాల వారి ప్రాధాన్యతను, ప్రాశస్త్యాన్ని రికార్డు చేసిండు.
”నేనే గ్రామ పోషకున్ని/ నాగలికి నడక నేర్పి/ మెతుకును అందించేవాణ్ణి/ నీ మానానికి అభిమానానికి” అంటూ వృత్తికులాల సేవ, కళా నైపుణ్యాన్ని కైగట్టిండు. అంతేగాదు వీళ్లందరూ కలిసి ఉన్నట్లయితే ఎంతటి వారినయినా ఎదిరించొచ్చు. అనుకున్నది సాధించవచ్చు అని ఇట్లా రాసిండు.
”ఇక సమయం లేదు/ సందర్భం జారిపోతే రాదు/ రండి!!” అని పిలుపునిచ్చిండు. బహుజనుల జీవితాలనే కాదు నిత్యం జీవనోపాధి కోసం మూరెడంత జాగలోనే బతుకుదెరువు వెతుక్కునే చెత్రీలను రిపేర్‌ చేసే రహీమ్‌ని, షరీఫ్‌బాయిని గుండెలకద్దుకున్నడు. ముస్లిములనూ అక్కున చేర్చుకున్నడు. పొట్టకోసం రోడ్డుమూలన మూరెడు జాగలో కూర్చొన్న అతణ్ణి ఆ స్థలం నుంచి బేదఖల్‌ చేయడాన్ని కన్నీళ్ళతో రాసిండు. బాసటగా నిలిచిండు. అదే విధంగా కరోనా కాలములో బంధువులు భయంతో తమవారి అంత్యక్రియలు చేయడానికి భయపడుతున్న సమయంలో కొంతమంది ముస్లిములు ఎవరో కూడా తెలియని హిందువుల అంత్యక్రియలు వారి మతాచారాల ప్రకారమే నిర్వహించారు. వీళ్ళని ‘నేలదిగిన నెలవంకలు’ పేరిట కవిత్వీకరించాడు.
”తలపై తెల్లని గొడుగు/ వాళ్ళ నైజానికి అదే అసలైన రంగు/ భయాన్ని పైజామా బొందెకు కట్టేసి” అంటూ వారి మానవత్వాన్ని గురించి రాసిండు.
ప్రజలకోసం కొట్లాడిన స్టాన్‌స్వామిని నిర్బంధించడాన్ని నిరసించిండు. బహుజన జెండా పేరిట ఉద్యమాల ఊపిరి ఉ.సాంబశివరావు స్మృతిలో, అక్షర విలుకాడు పేరిట సి.నారాయణరెడ్డిపై, బతుకంతా పాటగా పేరిట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కవితలల్లిండు. అయితే వీటన్నింటి కన్నా తన కన్నతండ్రి, తత్త్వకవి ఉదారి నాగదాసుని తలచుకుంటూ రాసిన కవిత కండ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి.
”ఎంత గొప్ప చేతులు నాన్నా నీవి?/ దాకలిపై వేసే సుత్తి దెబ్బలకు/ సున్నితమంతా కమిలిపోయి” అంటూ తన తండ్రిని తలుచుకున్నాడు. ఈ కవితా సంపుటిలో మరో విశేషమేమిటంటే తెలంగాణ మట్టి పరిమళానికి ఆనవాళ్ళైన తెలుగు-ఉర్దూ మిశ్రమ పదాల వాడుక. ఆ పదాలు కవిత్వంలో ఎంతలా ఒదిగిపోయాయి అంటే అది పరాయి భాష కాదని, తెలంగాణ వారికి నిత్యవాడుకలో ఉన్న జీవ భాష అని అర్థమయితది.
మనుషుల పట్ల మమకారముండే తెలంగాణ కవి హృదయ స్పందన ఈ కవిత్వం. పట్టరాని ఆగ్రహమొచ్చినా మాట తూలకుండా నిలకడగా ఉంటూనే చెప్పాల్సిన విషయాన్ని కరాఖండిగా చెప్పిండు. గాయి కాకుండా ఆర్ధ్రత, ఆత్మీయత కలగలిపి ‘మళ్లీ మనిషిలోకి’ తీసుకెళ్లిన ఉదారి నారాయణకు అభినందనలు. ఆదిలాబాద్‌ కాదు హమారా దిల్‌ ఆబాద్‌ అంటున్న ఉదారికి మేలు తలపులు.
– డా||సంగిశెట్టి శ్రీనివాస్‌
9849220321