– సినీ పక్కీలో దోపిడీ
– వరుసగా ఒకే చోట మూడోసారి చోరీ
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ఆగి ఉన్న ప్రయివేటు బస్సులో నుంచి రూ.28లక్షలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులాయిపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై ఉన్న పూ.ఇత హోటల్ వద్ద జరిగింది. ఆ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సుల్లో చోరీ జరగడం ఇది మూడోసారి. స్థానిక ఎస్‌ఐ సైదాబాబు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలావర్ధపల్లిలోని కృష్ణాపురం కాలనీలో నివాసముంటున్న పాండా సుశాంత్‌కుమార్ త్రిశక్తి ప్లాస్టిక్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో తనకు వ్యాపారం లో రావాల్సిన డబ్బుల కోసం వెళ్లారు. రూ.28లక్షలు తీసుకొని, ఒక బ్యాగులో రూ.24లక్షలు, మరొక బ్యాగులో రూ.4 లక్షలతోపాటు బట్టలు పెట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో ఒడిశాలోని బరంపూర్‌లో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంగళవారం రాత్రి ఎక్కాడు. ఆ బస్సును నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారి 65పై పూజిత హోటల్ వద్ద టీ, టిఫిన్ కోసం డ్రైవర్ ఆపారు. బ్యాగులను బస్సులోనే ఉంచి టీ కోసం అందరితోపాటు సుశాంత్ కూడా హోటల్‌కు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి చూడగా బ్యాగులు కనిపించలేవు. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులు ఉన్న డబ్బును తీసుకుని పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.సినీపక్కీలో పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ జరిగింది. హోటల్ వద్ద అప్పటికే కాచుకూర్చుంటున్న దుండగులు.. ఆగి ఉన్న బస్సుల నుంచి ప్రయాణికులు దిగి హోటల్లోకి వెళ్లగానే చోరీకి పాల్పడుతున్నారు. ప్రయాణికులు దిగే వరకు వేచి ఉండి వెంటనే బస్సులోకి వెళ్లి బ్యాగులను వెతకడం.. డబ్బులు ఉన్న బ్యాగులను తీసుకొని వెంటనే వేరే వాహనంలో పరారవుతున్నారు. జాతీయ రహదారి వెంట ఇప్పటికి ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో జరిగిన రూ.28 లక్షల దోపిడీ ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. స్థానిక పోలీసులతోపాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. అంతరాష్ట్ర దొంగలు ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
ఒకే చోట మూడోసారి..
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పూజిత హోటల్ వద్ద మూడు సంవత్సరాల్లో మూడోసారి చోరీ జరిగింది. గతంలో రెండుసార్లు 20 లక్షల రూపాయలు, 20 తులాల బంగారం ఆగి ఉన్న బస్సు నుంచి అపహరణకు గురయ్యాయి. అదే తరహాలో బుధవారం రూ.28 లక్షల చోరీ జరిగింది.