– సీపీఐ (ఎంఎల్) లిబరేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ పెద్దల కోసమే 111 జీవో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 84 గ్రామాల పరిధిలో 1,32,000 ఎకరాల భూమి 111 జీవో పరిధిలో ఉన్నదని తెలిపారు. వీటిలో 70 శాతం భూమి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సినీ పెద్దలు, రాజకీయ నాయకుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. బడా బాబులకు మేలు చేసేందుకు 111 జీవోను రద్దు చేశారని తెలిపారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను సైతం ప్రభుత్వం ధిక్కరించిందని పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయని గుర్తుచేశారు. భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయని తెలిపారు. వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిద్యానికి రక్షణ, అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయని పేర్కొన్నారు. భావితరాల కోసం, జంట నగరాలను వరదల నుంచి రక్షించుకునేందుకు, జీవవైవిద్యాన్ని కాపాడుకునేందుకు 111 జీవో రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.