– ఐదు నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్
– 8.45 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి : విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అమలు చేస్తున్న నిమిషం నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే నిర్దిష్ట కారణాల వల్ల ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు దీన్ని అమలు చేయాలని సూచించారు. నిమిషం నిబంధన వల్ల ఆలస్యమైన ఓ విద్యార్థి ఆదిలాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ నిబంధన పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు ఆ నిర్ణయాన్ని సమీక్షించి విద్యార్థులకు తీపికబురు అందించారు. ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని నిర్ణయించారు.
20,394 మంది గైర్హాజరు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షను నిర్వహించామని శృతి ఓజా తెలిపారు. ఈ పరీక్షకు 5,00,936 మంది దరఖాస్తు చేయగా, 4,80,542 (95.93 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 20,394 (4.07 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఒకరు కలిపి నలుగురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులను నమోదు చేశామని తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. ఆదిలాబాద్, రంగా రడ్డి, కామారెడ్డి, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఇంటర్ బోర్డు నుంచి పరిశీలకులు వెళ్లి పరీక్షను పరిశీలించారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతం గా, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జరిగిందని పేర్కొన్నారు.