సవాళ్ళను ధైర్యంగా స్వీకరిస్తేనే…

If you accept challenges with courage...ఏ తల్లైనా మొదటగా కోరుకునేది ఏమిటి? తన పిల్లలకు ఆరోగ్యకరమైన, శుచి, రుచికరమైన ఆహారం అందించాలనే కదా! కానీ నేటి బిజీ జీవితం వల్ల ఇంటా, బయటా పనులతో క్షణం తీరిక ఉండడం లేదు. చాలా మంది ఇంట్లో వండే ఓపిక లేక కృత్రిమ రంగులు, రసాయనాలతో కూడిన ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లను ఆశ్రయిస్తున్నారు. లేదంటే హోటల్‌ ఫుడ్‌తోనో, పూట భోజనంతో గడిపేస్తున్నారు. రుచి, శుచి లేని ఆ ఆహారం వల్ల సంపాదనలో సగం ఆసుపత్రి బిల్లులకు సమర్పిస్తున్నారు. అందుకే అన్నీ కల్తీమయమైన ఈ రోజుల్లో రసాయనాలు కలపని రుచికరమైన పోషకాహారాన్ని అందించే వ్యాపారం ప్రారంభించారు శిల్పిసింగ్‌. అసలు ఈ ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…
జంక్‌ ఫుడ్‌తో కలుగును జబ్బులు.. అధిక కొవ్వు అనారోగ్య హేతువు! గింజ పైపొరలో పోషకాలు.. శరీరపుష్టికి నెలవులు చిరుధాన్యాలు.. మానవులకు ఆయురారోగ్య ములనిచ్చు వరములు.. శరీరపుష్టిని కలి గించు తృణధాన్యాలు… తాతముత్తాతల కాలం నాటివని.. తృణప్రాయమని తృణీకరించకుమా తృణ ధాన్యాలు.. ఆరోగ్యభాగ్యమునకవే మేటి నిలువలు… అని చాటిచెప్పేలా 2019లో మొదలుపెట్టిన తన వ్యాపార విస్తరణలో మైలురాళ్లను దాటుతూ, సానుకూల దృక్పథంతో లక్ష్యాన్ని చేరే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు శిల్పి సింగ్‌.
చదివిన చదువుకు సార్థకత
ఉత్తరప్రదేశ్‌లో జన్మించి ఐ. ఐ. టి.రూర్కీలో బి.టెక్‌, లోవా స్టేట్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌ పూర్తి చేసిన ఈ ఉన్నత విద్యావంతురాలు హైద్రాబాద్‌ ఐఎస్‌బిలో ఎం.బి.ఎ. కూడా చేసారు. పద్నాలుగేండ్ల పాటు వివిధ కంపెనీలకు వృత్తిపరంగా తన సేవలనం దించారు. తన చదువుకు సార్థకత చేకూరేలా ఆరోగ్యానికి రుచికరమైన పోషకాహారం అని అర్థం వచ్చేలా FSSAI  వరను ప్రారంభించారు.
మధుమేహులకు సైతం
చిరుధాన్యాలంటే వంటకు ఎక్కువ సమయం పడుతుంది, రుచిగా ఉండవు వంటి అపోహలు కరోనా తర్వాత ప్రజల్లో తొలగిపోయాయి. అందరికీ వీటి పట్ల పెరిగిన మక్కువ, ఆరోగ్య స్పృహను ఆమె గమనించారు. ఏడాదిన్నరపాటు వీటిపై పరిశోధన చేశారు. అన్ని వయసుల వారికీ ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులపై దృష్టి పెట్టారు. ఏ కృత్రిమ రసాయనాలను, రంగులను వాడకుండా సహజంగా లభించే చిరుధాన్యాలతో తిండి పదార్థాల ఉత్పత్తి ప్రారంభించారు. వాటిలో గోధుమపిండి, బెల్లం, పల్లీలు మొదలైనవి కలిపి చేసే మిల్లెట్‌ కిచిడీ, దోసె, ఓట్స్‌ ఇడ్లీ, జొన్న ఉప్మా, నూడుల్స్‌, రెడీ టు మిక్స్‌లు, చిక్కీలు, కుకీస్‌ వంటివి ఎన్నో వున్నాయి. అంతేకాక రోగనిరోధకశక్తిని పెంచే పానీయాలు, సత్తు మిక్స్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హైద్రాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, తిరుపతి నగరాల్లో 400 పైగా స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
నిపుణుల పర్యవేక్షణలో
తయారీలో పరిశుభ్రత, నాణ్యత పాటిస్తూ సుమారు ఆరునెలల పాటు నిల్వ ఉండే పోషకాహార పదార్థాలను శిల్పిసింగ్‌ ఉత్పత్తి చేయిస్తున్నారు. ఇవి మధుమేహులు కూడా నిర్భయంగా తీసుకోవచ్చు. అమెజాన్‌,ప్లిప్‌ కార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి ఆన్లైన్‌ సోర్స్‌లోనూ లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు ఖీూూA× ఆమోదముద్రను కూడా పొందాయి. ఇదంతా అంత సులభంగా జరగలేదు. కొత్త బ్రాండ్‌ కనుక మొదట్లో డిస్ట్రిబ్యూటర్‌ దొరకలేదు. దాంతో వినియోగ దారులకు ఉత్పత్తులు ఆమే స్వయంగా అందించేవారు. అంతేకాక తాను సొంతంగా పొదుపు చేసిన డబ్బునే మొదట పెట్టుబడిగా పెట్టారు. తర్వాత కుటుంబం, మిత్రుల సహాయంతో వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసారు. ‘సాధించాలనే సంకల్పం దృఢంగా ఉంటే సాకారం కానిదేముంది. అందులోనూ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్న నేటి మహిళలకు అసాధ్యమన్నది ఏమున్నది’ అంటారు ఆమె.
రిస్క్‌లను కిస్‌ చేయడం తన నైజం
‘ఇంత చదువు చదివి పెద్ద జీతమొచ్చే ఉన్నతోద్యోగం వదులుకొని వ్యాపారం చేస్తావా’ అంటూ చాలామంది మిత్రులు, బంధువులు యథాప్రకారంగా వెనుకకు లాగే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ పట్టించుకోలేదు. సహజంగా తనకున్న ఆరోగ్యస్పృహ, శ్రద్ధ, సొంతవ్యాపారంపై గల మక్కువతో తప్పకుండా అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాన్ని సాధించారు శిల్పి. కాల్షియం నిల్వల ఖజానా అయిన రాగి చిక్కీలు తనకు చాలా ఇష్టమని చెప్పే శిల్పి వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రిస్క్‌లను కిస్‌ చేయడం తన నైజం అంటారు.
మహిళలకు సహాయ సహకారాలు
pharmaseuticles రంగంలో పనిచేసే తన భర్త, కుటుంబం అండదండలు ఆమెకు మెండుగా వున్నాయి. అలాగే శిక్షణ, రిటైల్‌ స్టోర్స్‌కి తమ ఉత్పత్తుల అనుసంధానం చేయడం, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు, ఇలా చాలా అంశాల్లో వి హబ్‌ వారి సహాయ సహకారాలు, మార్గదర్శకత్వం లభించాయి. స్టాండర్డ్‌ పార్క్‌ సీడ్‌ ప్రోగ్రాంకు కూడా ఎంపికయ్యారు. ‘ప్రతి మహిళా వృత్తిగత, వ్యక్తిగత పనులను బేరీజు వేసుకోవాలి. పనులకు తగిన సమయం కేటాయించుకోవాలి. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, ఎత్తుపల్లాలను, సవాళ్ళను ధైర్యంగా స్వీకరించాలి. అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించగలరు’ అంటారు ఆమె. సాటి మహిళలకు సహాయ సహకారాలు అందించడం తనకు తృప్తినిస్తుందని అంటారు. అంతేకాక వర్కింగ్‌ మదర్‌ పిల్లల కెరీర్‌పై సానుకూల ప్రభావం చూపగలదని, అది తన స్వీయానుభవం అంటారు ఆమె. భవిష్యత్‌లో అన్ని మెట్రో నగరాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులోకి రావాలని, విదేశాలకు తమ నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేయాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నారు.
– చంద్రకళ. దీకొండ, 9381361384