తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారిపై చర్యలు తీసుకోవాలి

– విలేకరుల సమావేశంలో బాధితుడు పాలకుర్తి కృష్ణ దంపతులు
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్‌
ప్రభుత్వం మంజూరు చేసిన నివాస స్థలంలో ఇంటిని నిర్మించుకున్నామని, ఆ విలువైన భూమిని తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకొని మాపై కార్పొరేటర్‌ భర్త బిక్కసాని జస్వంత్‌, ఆళ్ల అంజిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పాలకుర్తి కష్ణ, అతని భార్య పాలకుర్తి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2004 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ఖమ్మం అర్బన్‌ సర్వే నంబర్‌ 94 లో 100 గజాల నివాస ఇంటి స్థలం పట్టాను పాలకుర్తి జ్యోతి పేరుతో మంజూరు చేశారన్నారు. అన్ని అనుమతులు తీసుకొని ఇంటిని నిర్మించామని, ఇదే స్థలాన్ని 2004 సంవత్సరంలో వైరా ఎమ్మార్వోగా పని చేస్తూ, ఎలక్షన్‌ డ్యూటీలో మరణించిన కందుల నాగేశ్వరరావు భార్య కందుల మార్తమ్మకు 2011 సంవత్సరంలో అవార్డు కాపీ కింద, సర్వేనెంబర్‌ 94 లో 175 గజాల నివాస స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వటం జరిగిందని తెలిపారు. కందుల మారతమ్మ, అతని కుమారుడు కందుల అనిల్‌ ( రెవిన్యూ ఉద్యోగి ) చెబుతున్నారని ఈ స్థలాన్ని 2019 సంవత్సరంలో గంగసాని అప్పారావు, బిక్కసాని సాయి గీత ( 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ బిక్కసాని ప్రశాంత లక్ష్మి అత్త) బిక్కసాని జస్వంత్‌ కు తల్లి…కందుల మారతమ్మ, కందుల అనిల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందని, 2011 సంవత్సరంలో వాళ్లకి నిజంగా 175 గజాల రివార్డ్‌ కాపీ ఇచ్చుంటే, వాళ్లు 2021 రెవెన్యూ శాఖ నుండి ఎన్‌ఓసి తీసుకొని జస్వంత్‌ తల్లి సాయి గీత, గంగసాని అప్పారావుకు రిజిస్ట్రేషన్‌ చేయవలసి ఉంటుందని తెలిపారు. కానీ రెండు సంవత్సరాల ముందే అంటే 2019 సంవత్సరంలోనే ఎలాంటి ఎన్‌ఓసి లేకుండా రిజిస్ట్రేషన్‌ చేశారని విమర్శించారు. 2019 సంవత్సరంలో గంగసాని అప్పారావు, బిక్కసాని సాయి గీత, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టిఎస్‌బి పాస్‌లో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఆ టైంలో కూడా ఎలాంటి ఎన్వోసీ పెట్టలేదని తెలిపారు. అంతకంటే ముందే 2011 నే తాము ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 2004 తర్వాత నిర్మాణంలో ఉన్న నా ఇంటికి ఏ విధంగా పర్మిషన్‌ వారికి ఇచ్చారో తెలియడం లేదని,నా దగ్గర 2004లో 100 గజాలు ఇచ్చినట్టుగా పట్టా, 2004 తర్వాత నిర్మాణం చేయుట నా ఇంటి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అన్నారు. ఈ స్థలం వివాదం పై టిఆర్‌ఎస్‌ మాజీ మంత్రి అనేకసార్లు నన్ను బెదిరించి, నాకు ప్లాట్‌ వదులుకోవాలని వార్నింగ్‌ ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలు సష్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన కందుల మార్తమ్మ, కందుల అనిల్‌ కుమార్‌, గంగసాని అప్పారావు, బిక్కసాని సాయి గీత, బిక్కసాని జస్వంత్‌, ఆళ్ల అంజిరెడ్డి ,బిల్డింగ్‌ అండ్‌ ప్లానర్‌ వెంకట్రావులపై చట్టపరంగా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎల్‌హెచ్‌పిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్‌ భద్రు నాయక్‌, సంఘం జిల్లా నాయకులు పీ. సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.