రోడ్డు భద్రతా నియమాలు అతిక్రమిస్తే చర్యలు

– జిల్లా 35వ రోడ్డు భద్రత నెలవారీ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 15 నుండి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు భద్రత నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖ అధికారి జైపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా 35వ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రచార కార్యక్రమాన్ని, నెలవారీ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో రహదారి భద్రతా అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుండి 22 వరకు భద్రాద్రి జిల్లాలో ఉన్న పాఠశాల, కళాశాలలో క్విజ్‌లు, వ్యాస రచన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 23 నుండి 26 వరకు పాఠశాలలో కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 27 నుండి 28 వరకు హెల్మెట్‌ ధరించడంపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ నెల 29 నుండి 31 వరకు ఎంవిఐ చట్టం ప్రకారం కఠినమైన అమలు, విజిబిలిటీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, గూడ్స్‌ వాహనాల్లో ఓవర్‌లోడింగ్‌పై కేసులు బుక్‌ చేయడం, ప్యాసింజర్‌ వాహనాల్లో అదనపు ప్రయాణికులను తీసుకెళ్లడం తనిఖీలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి1 నుండి 3 ఫిబ్రవరి వరకు రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టర్లను అతికించడంపై ట్రాక్టర్‌, ట్రైలర్లపై అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి 4 నుండి 6 వ తేదీ వరకు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నామని చెప్పారు.ఫిబ్రవరి 7 నుండి13 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బ్లాక్‌ స్పాట్‌లపై రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌, బ్లాక్‌ స్పాట్‌ల దగ్గర సైన్‌ బోర్డుల ఏర్పాటు చేయడం, సరిదిద్దడానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగాలకు సిఫార్సు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.