కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

– నియోజకవర్గం అభ్యర్థి కారం పుల్లయ్య
– 8న నామినేషన్‌
– జయప్రదం చేయండి : మచ్చా
నవతెలంగాణ-చర్ల
భద్రాచలం శాసన సభ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్య గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు యలమంచి రవికుమార్‌లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం బీఎస్‌ రామయ్య భవన్‌లో మండలస్థాయి విస్తృత సమావేశం మండల కార్యదర్శి కారం నరేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన, గిరిజనేతర ప్రజల అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. గత ఎమ్మెల్యేలుగా పని చేసిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల వారసుడిగా సామాన్యుడు, విప్లవకారుడైన కారం పుల్లయ్య సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అన్నారు. పేదలందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. విపరీతంగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. దళిత బందు, గృహలక్ష్మి పేరుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకులు పేదల వద్ద, దళితుల వద్ద లక్షల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. పేదల డబ్బులు దోచుకునే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని అన్నారు. డబ్బు రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి మాట్లాడుతూ చర్ల మండలంలో భూమి లేని పేదలకు, గిరిజనులకు భూములు పంచి రైతులను చేసింది సీపీఐ(ఎం) పార్టీ అన్నారు. పోడుసాగుదారులకు హక్కు పత్రాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి పట్టాలు సాధించామని అన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాలకు రోడ్లు, విద్యుత్‌, లిఫ్టులు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు పోరాడి సాధించారని తెలిపారు. పొదెం వీరయ్య గెలిచిన తర్వాత మండలానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నవంబర్‌ 8వ తేదీన భద్రాచలంలో నామినేషన్‌ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్‌, మండల కార్యదర్శి కారం నరేష్‌, జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు, కొమరం కాంతారావు, తాళ్లూరి క్రిష్ణ, మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, పొడుపుగంటి సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, దొడ్డి హరినాగవర్మ, శ్యామల వెంకట్‌, పామర్‌ బాలాజీ, శ్యామల నాగేశ్వరరావు, ఊకే రామకృష్ణ, సుబ్బంపేట సర్పంచ్‌ ఏక సుజాత, శ్రీను, వరదల వరలక్ష్మి, షారోని, పామర్‌ లక్ష్మి, సీతయ్య, భద్రకేళి, రాంబాబు, వెంకటేశ్వర్లు, తుర్రం గాందెమ్మ, పాయం వెంకటేశ్వర్లు, పాయం రమాదేవి, పాయం చంటి తదితరులు పాల్గొన్నారు.