– డాక్టర్ వైఆర్‌కే సతీమణిగా ఉద్యమాలకు అండ
– సీపీఐ (ఎం)కు పోరాటాలకు ఆమె దన్ను: పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళి
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
మాజీ ఎంపీ, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్‌కే) సతీమణి సరళాదేవి (94) జీవితం ఆదర్శప్రాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనారోగ్యంతో ఖమ్మంలోని ఆమె స్వగృహంలో గురువారం తెల్లవారుజామున 1.15 గంటలకు కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని తమ్మినేని సందర్శించారు. కాల్వొడ్డులోని హిందూ శ్మశాన వాటికలో సరళాదేవికి నివాళి అర్పించారు. అమె కుమారులు డాక్టర్లు యలమంచిలి రవీంద్రనాథ్, రామకోటేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. సరళాదేవి సీపీఐ(ఎం)కి అందించిన సేవలను మననం చేసుకున్నారు. సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాల్లో సరళాదేవి వైఆర్‌కేకు అండగా నిలబడ్డారని తెలిపారు. ప్రజా పోరాటాల్లో భాగంగా రాధాకృష్ణమూర్తి జైలు జీవితం గడిపినప్పుడు కుటుంబాన్ని ఆమె ముందుకు నడిపించారన్నారు. వారి ఇద్దరు కుమారులను డాక్టర్లుగా తీర్చిదిద్దడంలోనూ ఆమె పాత్ర ఎనలేనిదని తెలిపారు. సరళాదేవి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. నివాళి అర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, మంత్రి అజరు పీఏ రవికిరణ్, ఖమ్మంలోని ప్రముఖ వైద్యులు, సీపీఐ (ఎం) జిల్లా నాయకులు, వివిధ పార్టీల నేతలు ఉన్నారు.