దత్తత వెళ్లాక పుట్టింటి ఆస్తిపై హక్కుండదు హైకోర్టు తీర్పు

నవతెలంగాణ – హైదరాబాద్‌
దత్తత వెళ్లిన వ్యక్తికి అతను పుట్టిన కుటుంబంలోని ఆస్తికి హక్కుదారుడు కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏవీఎల్‌ఆర్‌ నర్సింహరావ్‌ వేరే కుటుంబానికి దత్తత వెళ్లాక తాను పుట్టిన కుటుంబ ఆస్తిలో వాటా కావాలని కోరుతూ దాఖలు చేసిన దావాలో అనుకూల ఉత్తర్వులు పొందారు. దీనిని ఆయన సోదరుడు నాగేశ్వర్‌రావు హైకోర్టులో సవాల్‌ చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌రావుతో కూడిన ముగ్గురు జడ్జీల బెంచ్‌ సోమవారం తీర్పు చెప్పింది. దత్తత వెళ్లడానికి ముందు అతను లేదా ఆమె పేరిట ఆస్తి రాసినా, కానుకగా ఇచ్చినా వాటిలో మాత్రమే హక్కుదారుడు అవుతాడని, దత్తత తర్వాత జన్మించిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉండదని స్పష్టం చేసింది. జన్మనిచ్చిన కుటుంబంలో అంత్యక్రియల దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా దత్తత వెళ్లిన వ్యక్తికి ఆర్థిక ఆస్తిపరమైన సంబంధం ఉండదని, పుట్టగానే ఆస్తి హక్కు ఉన్నట్టుగా చెబుతున్నప్పుటికీ అది హక్కు కాదని, దత్తత చట్టం వర్తిస్తుందని వెల్లడించింది.
బదిలీలపై స్టే పొడిగింపు
ఉపాధ్యాయుల బదిలీలను సవాల్‌ చేసిన కేసులో స్టే ఉత్తర్వులను ఈనెల 11 వరకు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సక్కుబారు ఇతరులు టీచర్ల బదిలీ జీవో తొమ్మిదిని సవాల్‌ చేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. స్టే రద్దు చేయాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చింది. స్టే ఎత్తేల్సిన తొందర ఏమీ లేదని చెప్పింది.
18కి కేంద్ర సర్వీస్‌ ఆఫీసర్ల కేసు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి ఏపీలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి కేంద్ర సర్వీస్‌ ఆధికారుల బదిలీ వ్యవహారంపై దాఖలైన కేసుల విచారణ ఈనెల 18కి వాయిదా పడింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫారసుల మేరకు ఏపీకి కేటాయింపునకు గురైన డీజీపీ అంజనీకుమార్‌ ఇతరులు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో సవాల్‌ చేసి స్టే ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించిన కేసులను జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి బెంచ్‌ విచారించింది. తమ వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అవసరం లేదంటూ కేంద్రం చెప్పింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని హైకోర్టు సలహా ఇచ్చింది.