22 కాంట్రాక్టులు ఒకరికే ఎలా ఇస్తారు?

మేం చెప్పే వరకు బిల్లులివ్వొద్దు: హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
భదాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన 22 కాంట్రాక్టు పనుల్ని ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఒక కాంట్రాక్టర్‌పై ఎందుకు అంతశ్రద్ధని ప్రశ్నించింది. ఒకే కాంట్రాక్టర్‌కు నామినేషన్‌ ప్రాతిపదికన 22 పనులు అప్పగించడం ఏమిటని నిలదీసింది. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించవద్దని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన అధికారులను, ఎంఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు వేసిన పిల్‌లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు అప్పగించిన పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. అనుమతులు లేని పనులను ఎంఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు కట్టబెడుతున్నారనీ, అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులుగానీ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతుల్లేకుండా రోడ్లు, వంతెనలు నిర్మాణ పనులు చేస్తోందన్నారు. తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.

Spread the love