హైకోర్టు తుదితీర్పు తర్వాత …

– ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం : మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైకోర్టు తుదితీర్పు వచ్చాక ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం అంశం పై ఆ ఆస్పత్రి పరిధి ప్రజా ప్రతినిధులతో మంత్రి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి నూతన నిర్మాణం చేపట్టాలని ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వారి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్‌ రూపంలో హైకోర్టుకు తెలియ చేస్తుందని తెలిపారు. నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ 2015లోనే ఆ ఆస్పత్రిని సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తదనంతరం నిర్మాణం కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల కమిటీ కూడా ఆస్పత్రి అవసరాలకు ఈ భవనం పని చేయదని చెప్పిందని వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నట్టు వివరించారు. కొత్త భవనం నిర్మాణానికి ఏకగ్రీవంగా అంగీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌ రావు, వాణీ దేవి, రహమత్‌ బెగ్‌, హసన్‌ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌, దానం నాగేందర్‌, గోపీనాథ్‌, జాఫర్‌ హుస్సే న్‌, కౌసర్‌ మోయినుద్దీన్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగా ధర్‌, టీఎస్‌ఎంఐడీసీ ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఉస్మా నియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.