భూదాన్‌ బోర్డు మాజీ చైర్మెన్‌ రాజేందర్‌రెడ్డిపై

– కేసు కొట్టేసిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
భూదాన్‌ బోర్డు మాజీ చైర్మెన్‌ జి.రాజేందర్‌రెడ్డిపై కూకట్‌పల్లి పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నెం.353, 354ల్లోని ప్రభుత్వ భూములకు తప్పుడు పత్రాలు తయారు చేసి అమాయకులకు అమ్మేశారంటూ కూకట్‌పల్లి ఎమ్మార్వో గతేడాది ఆగస్టు 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రాజేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన జస్టిస్‌ అనుపమచక్రవర్తి ఇటీవల తీర్పు చెప్పారు. భూదాన్‌ బోర్డు మాజీ చైర్మెన్‌ రాజేందర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారన్న న్యాయవాది పాశం మోహిత్‌ వాదనలను ఆమోదించింది. ‘ఆరోపణలకు సంబంధించి ఎమ్మార్వో ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేయడం చెల్లదు. కేసు నమోదై ఏడాది దాటినా దర్యాప్తు పూర్తి చేయలేదు. ఆ కేసును కొట్టేయాలి. కేసు నమోదు చేసి ఏడాది దాటినా దర్యాప్తు పూర్తికాలేదు. తహసీల్దార్‌ ఫిర్యాదు ఆధారంగా 2022 ఆగస్టు 12న కూకట్‌పల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలి’ అని మోహిత్‌ వాదనలు వినిపించారు. ‘వాదనల తర్వాత హైకోర్టు రికార్డులను పరిశీలించి చూస్తే అది ప్రభుత్వ భూమి కాదని తేల్చింది. 1965లో ఫైసల్‌ పట్టి నుంచి తొలగించిన మూసాపేట సర్వే నెంబర్‌ 191, 192లు కూకట్‌పల్లికి చెందిన 20 ఎకరాలు 353, 354 సర్వే నెంబర్లపై ఓవర్‌ల్యాప్‌ అయినట్లుగా రెవెన్యూ అధికారుల ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ద్వారా తేలింది. సర్వే నెంబర్‌ 353, 354ల్లోని 24.26 ఎకరాలు భూదాన్‌ బోర్డు భూములని 2023 జూన్‌ 7న తెలంగాణ భూదాన్‌ బోర్డు ప్రకటించింది. 2014 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ప్రకారం అవి ప్రభుత్వ భూములు కాదు. వాటిని పేదల ప్రజల ఇండ్ల కోసం ఇచ్చారని తేలింది. అవి ప్రభుత్వ భూములు కానప్పుడు భూదాన్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ కూకట్‌పల్లి తహసీల్దార్‌ ఫిర్యాదు చేయడం చెల్లదు. ఆ ఫిర్యాదు ఆధారంగా కూకట్‌పల్లి పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదు’ అని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉటంకిస్తూ పిటిషన్‌ను ఆమోదించింది.