త్రిపురలో రెచ్చిపోయిన గోగూండాలు

– ఆవులను దొంగతనం చేస్తున్నాడని వ్యక్తిపై మూకదాడి
– గాయాలతో బాధితుడి మృతి
ఆగర్తల : బీజేపీ పాలనలోని త్రిపురలో గోగూండాలు మరోసారి రెచ్చిపోయారు. ఆవులను దొంగతనం చేస్తున్నాడని ఆరోపిస్తూ 41 ఏండ్ల ఒక వ్యక్తిపై మూకదాడికి పాల్పడ్డారు. ఏకంగా విద్యుత్‌ స్థంభానికి కట్టేసి వెదురు కర్రలతో దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దారుణం పశ్చిమ త్రిపుర జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్‌ చంద్రపూర్‌ గ్రామానికి చెందిన 41 ఏళ్ల నందు సర్కార్‌ను ఆవులు దొంగతనం చేస్తున్నాడని ఆరోపిస్తూ గురువారం ఉదయం 8 గంటల సమయంలో గోగూండాలు బలవంతంగా ఇంటి నుంచి లాక్కొని వచ్చారు. పశువులా ఈడ్చుకుని తీసుకుని వెళ్లి కరెంటు స్థంభానికి కట్టివేశారు. వెదురు కర్రలతో ఇష్టం వచ్చినట్లు దారుణంగా కొట్టారు. కొద్ది సేపటి తరువాత విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్ర గాయాలతో ఉన్న నందు సర్కార్‌ను సమీపంలోని రాణిబజార్‌ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ నందూ మృతి చెందాడు.