– కొనసాగుతున్న సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో భాగంగా మంగళవారం పలుచోట్ల బిక్షాటన చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. రోడ్లపైనే వంటావార్పు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లో జీపీ కార్మికులు వంటావార్పు నిర్వహించారు. ఎర్రుపాలెంలో వంటికాలుపై నిలబడి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో భిక్షాటన చేశారు. పట్టణంలోర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్మికులకు ఒక పూట భోజనం పెట్టారు. ఇల్లందులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రం, తిప్పర్తి, నకిరేకల్, నార్కట్‌పల్లి, చండూరులో బిక్షాటన చేశారు. వేములపల్లి మండలంలో జీపీ కార్మికులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాంపల్లి మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జీపీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో, మోటకొండూరు, చౌటుప్పల్ మండల కేంద్రాలో బిక్షాటన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కార్మి కులు బిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. తహసీల్దార్ సైదులుగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. తలకొండపల్లిలో వంటావార్పు చేశారు.