– సూపర్‌కింగ్స్‌తోనే ఎం.ఎస్ ధోని
– ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముంగిట ఆటగాళ్ల అట్టిపెట్టుకునే జాబితాకు తుది రూపు ఇచ్చేందుకు ప్రాంఛైజీ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలానికి ముంగిట అన్ని రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంది. అక్టోబర్ 31న అట్టిపెట్టుకునే జాబితా సమర్పించేందుకు తుది గడువు. అయితే, ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు జాబితాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్ మరోసారి ఎం.ఎస్ ధోనీని నిలుపుకోనుండగా.. కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు ఈ ఏడాది వేలంలోకి రానున్నారని సమాచారం.
కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను ఆ జట్టు వేలంలోకి వదిలేయనుంది. సునీల్ నరైన్, రింకూ సింగ్, హర్షిత్ రానా సహా వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకోనుంది. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను సైతం నైట్‌రైడర్స్ అట్టిపెట్టుకోవటం లేదు. చెన్నై సూపర్‌కింగ్స్ ఊహించినట్టుగానే ఎం.ఎస్ ధోని పేరును రిటెన్షన్ జాబితాలో చేర్చింది. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబె, మతీశ పతిరణ, ఎం.ఎస్ ధోనిలను ఆ జట్టు అట్టిపెట్టుకోనుంది. ఎవరిని ఎంత మొత్తానికి నిలుపుకుందనే విషయం తెలియాల్సి ఉంది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు మూడు సీజన్లలో సారథ్యం వహించిన కెఎల్ రాహుల్ వేలంలోకి రానున్నాడు. నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోరు, మోషిన్ ఖాన్, అయుశ్ బదానిలను ఆ జట్టు అట్టిపెట్టుకోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోనుంది.హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), ట్రావిశ్ హెడ్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ.8 కోట్లు) సన్‌రైజర్స్ రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మను నిలుపుకుంటుందా? వేలంలోకి వదిలేస్తుందా? ఆసక్తికరంగా మారింది.