కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరిని రెగ్యులర్‌ చేయాలి

–  రిజ్వీకి టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలం దరిని రెగ్యులర్‌ చేయాలని ఆ శాఖ కార్యదర్శి రిజ్వీని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు గురువారం ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియొద్దీన్‌, కె.యాదానాయక్‌ ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు పేషీలో వినతిపత్రాన్ని అందజేశారు. ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో విధించిన నిబంధనల కారణంగా 20 ఏండ్లగా కాంట్రాక్ట్‌ సర్వీస్‌లో ఉన్న ఐదు వేల మంది ఏఎన్‌ఎంలకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరిని యధావిధిగా ఖాళీ పోస్టుల్లో సీనియార్టీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వీరంతా గతంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌, మెరిట్‌ ప్రకారం ఎంపికై పని చేస్తున్నారని తెలిపారు. వీరిని మళ్లీ పరీక్ష రాయమనడం న్యాయం కాదని సూచించారు. తక్షణమే నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
ద్వంద్వ ప్రమాణాలెందుకు?
వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విధి విధానాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిం చడం పట్ల యూనియన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్ల ప్రతిభ ఆధారంగా సర్వీసుకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్‌ చేశారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి 2016 ఫిబ్రవరి 26న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు 16 ప్రకారం… వైద్యారోగ్యశాఖలో 2023 మే 3న జీవో నెంబర్‌ 49 జారీ చేసి, దాని ప్రకారం 68 మంది కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌)లను యధావిధిగా రెగ్యులర్‌ చేశారని తెలిపారు.
అదే విధంగా వివిధ శాఖల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల మందికిపైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసినట్టు చెప్పారు. దాని ప్రకారమే… మిగిలిన ఐదు వేల మంది కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌)లను సీనియార్టీ ప్రాతిపదికన రెగ్యులర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగులు కోర్టుకెళ్తామంటున్నారు….
వినతిపత్రాన్ని స్వీకరించిన రిజ్వీ మాట్లాడుతూ, నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు. లేకపోతే వారు కోర్టుకు వెళ్తామని అంటున్నారని యూనియన్‌ నాయకులకు తెలిపారు. అందుకు యూనియన్‌ నాయకులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేసిన తరువాత కొత్త వారికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ సూచనను పరిశీలిస్తామని రిజ్వీ హామీ ఇచ్చారు.