– పాలేరు ప్రజల అభిమానం వెలకట్టలేనిది
– బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ప్రజలకు సేవ చేయడంలో తనకు ఎలాంటి రాజకీయ బేధాలూ ఉండవని, ప్రజలందరూ నావాళ్లే అని భావించి ఏ కష్టం వచ్చినా అందరికీ సాయం చేస్తానని పాలేరు బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. తిరుమలాయ పాలెం మండలంలోని హస్నాబాద్, లక్ష్మీ దేవిపల్లి తండా, రఘునాథపాలెం, మంగలి బండ తండా, సుద్ధవాగు తండా, ముజాహిద్ పురం, జల్లేపల్లి, జోగులపాడు, చంద్రుతండా గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని, తన పనితనం ఏమిటో గత ఐదేళ్ళ కాలంలో చేసిన పనులు చెబుతాయన్నారు. తనది పని చేసే తత్త్వం తప్ప అవాకులు,చవాకులతో ఎదుటివారిని విమర్శించే నైజం కాదని వెల్లడించారు. ఎక్కడి నుంచో ఎవరెవరో వచ్చి ఏవేవో చెబుతారని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మండలంలోని గోల్‌తండాకి చెందిన వివిధ పార్టీలకు సంబంధించి సుమారు 22 కుటుంబాలు ఉపేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రచారంలో పాలేరు ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న, డిసిసిబి డైరెక్టర్ చావా వేణుగోపాలకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు పాల వెంకన్న, రామడుగు రమేష్‌రావు, మురళి, దరావత్ నరేశ్, ఆర్మీ రవి, చామకూరి రాజు, సర్పంచులు భాషబోయిన శైలజ, బోడా మంచా నాయక్, లపంగి రాములు పాల్గొన్నారు.