– చించల్ పేట్ వద్ద మూసినీ పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి
– వాగులు, చెరువులు దాటే ప్రయత్నాలు చేయొద్దు
– అత్యవసరం అయితే 100కు ఫోన్ చేయాలి
నవతెలంగాణ-నవాబుపేట్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చించల్‌పేట గ్రామంలో మూసినదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న వరద ఉదృతిని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. పొలాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శిథిలావస్థల్లో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలబడకుండా మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి వర్షపు నీరు సాఫీగా కాలువల గుండ ప్రవహించేలా చూడాలన్నారు. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ప్రతిరోజు క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని భారీ వర్షాల వల్ల ప్రజల కు ఇబ్బంది కలగకుండా తక్షణ సాయం కోసం 24/7 కాల్ సెంటర్ ను కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అత్యవసర సహాయం కోసం 7995061192కు కానీ100కు సంప్రదించలన్నారు. చిట్టి గడ్డ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే వద్ద నీరు నిల్వ ఉండడంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గ్రామ సర్పంచ్ కాలే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట వికారాబాద్ డీఎస్పీ కే నర్సింలు, ఆర్డీవో, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఎంపీఓ విజరు కుమార్, తహసిల్దార్ రవీందర్, చించల్ పేట్ గ్రామ సర్పంచ్ కాలే శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.