– జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి
తుశాకుల లింగయ్య పిలుపు
నవతెలంగాణ -కూసుమంచి
గొర్రెల పంపిణీ పథకం ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా దళారుల ప్రమేయం లేకుండా అమలు జరగడం కోసం నగదు బదిలీ రూపంలో అమలు చేయాలని, వాటాదనం ప్రభుత్వమే భరించి డిడిలన్ని తిరిగి వాపసీయాలని డిమాండ్ చేస్తూ జిఎంపిఎస్ ఆధ్వర్యంలో అన్ని యాదవ, కురుమ సంఘాల నాయకత్వంలో ఈనెల 22న జరిగే ఖమ్మం కలెక్టరేట్ మహా ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జియంపియస్ జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో గొర్రెల సొసైటీ చీప్ ప్రమోటర్ కాంచాని గురవయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ… డీడీలు కట్టి 15 నెలలుగా ఎందుకు ఎదురు చూడాలని ప్రశ్నించారు? బీసీ బందు, దళిత బంధు పథకాల మాదిరిగానే వాటాదనం లేకుండానే ప్రభుత్వమే భరించి గొర్రెల పంపిణీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడక్కడ ఇచ్చే గొర్రెలు కూడా పైరవీల ఆధారంగా అధికార పార్టీ శ్రేణులకు మాత్రమే ఇస్తున్నారని ఇది సరైనది కాదని విమర్శించారు. గ్రామాల డ్రా లిస్టులు పాటించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి గొర్రెలు పంపిణీ చేయడం మిగతా యాదవ కురములందర్నీ దూరం చేసుకోవడమే అని పేర్కొన్నారు. గొర్రెల కోసం నెల్లూరు, చిత్తూరు, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లిన వారి సమస్యలు వర్ణనాతీతం అని, అక్కడ కూడా కొంతమంది పశువర్ధక శాఖ మంత్రి బినామీలమని చెప్పుకుంటూ ఈ స్కీముని కమిషన్ల పేరుతో దోచుకొని పూర్తి అవినీతిమయం చేస్తున్నారని విమర్శించారు. ఈ దళారులను కాదని ఎవరైనా రైతు దగ్గర ప్రత్యక్షంగా గొర్రెలు కొనుగోలు చేస్తే వారికి డబ్బులు బదిలీ కాకుండా ఆపుతామని బెదిరింపులకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ జనరల్ బాడీలో గ్రామ పెద్ద గొల్ల గడ్డం గంగయ్య, పెద్దలు కోటయ్య, గడ్డం మురళి, బాలిని శ్రీశైలం, అసిమేకల కిరణ్, చెట్ల లింగయ్య, వెంకటేశ్వర్లు, పంచాయతీ వార్డు సభ్యులు లిక్కీ వెంకటమ్మ, రెడ్డిబోయిన సైదమ్మ పాల్గొన్నారు.