గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకి భూములివ్వం

– రైతులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు
– సమాచారం ఇవ్వకుండా మీటింగ్‌ ఎలా పెడతారని తహశీల్దార్‌ను నిలదీసిన రైతులు
– రైతుల ఆందోళనతో వాయిదా పడిన సమావేశం
నవతెలంగాణ-రఘునాథపాలెం
నాగపూర్‌ నుండి అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే కోసం త్రీడీ అవార్డు కోసం అంటూ రైతులకు సమాచారం ఇవ్వకుండా రహస్య పద్ధతిలో సమావేశంను రఘునాధపాలెం ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కొందరు రైతులు రైతు సంఘాల నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి రఘునాధపాలెం ఎమ్మార్వో ఆఫీస్‌ వద్దకు చేరుకొని ఎమ్మార్వోని నిలదీశారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా పెడతారని ప్రశ్నించారు. రైతులకు సమాచారం చెప్పాల్సిన అవసరం తమకు లేదని, పేపర్లో ప్రకటనిచ్చాం చూసుకోండి అంటూ తహశీల్దార్‌ రైతులతో దురుసుగా మాట్లాడారు. దీనితో ఆగ్రహించిన రైతులు ఎంఆర్‌ఓతో వాగ్వాదానికి దిగారు అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలతో సమావేశం వాయిదా పడింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సిపిఎం రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్‌.నవీన్‌ రెడ్డిలు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేల పేరుతో ఖమ్మం జిల్లాలో వందలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకుంటుందని విమర్శించారు. బహుళ పంటలు పండే భూములను నేషనల్‌ హైవేలకి తీసుకోవద్దని తెలిపారు. ఖమ్మం నగరాన్ని చీల్చుకుంటూ నూతన కలెక్టరేట్‌ వెలుపలగా పోతున్న నేషనల్‌ హైవే అలైన్మెంట్‌ వెంటనే మార్చాలని డిమాండ్‌ చేశారు. కొరవి నుండి కోదాడ ఫోర్‌ వే లైన్‌కి ఈ రోడ్డుని కలపాలని వారు కోరారు. ఇలా చేస్తే జిల్లాలో ఒక ఎకరం కూడా భూమి సేకరించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి భూసేకరణ కోసం డబ్బులు వెచ్చించాల్సిన పని కూడా ఉండదని వారు అన్నారు. రైతులకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా సమావేశం పెట్టి ఏ అభ్యంతరం రాలేదంటూ వారికి అనుకూలమైన నివేదికలు ఇచ్చుకోవడం కోసం అధికారులు తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారని వారు విమర్శించారు. అధికారులు ఈ అనైతిక పద్ధతులను విడనాడి రైతులకు న్యాయం జరిగేలాగా చట్టబద్ధంగా ముందుకు పోవాలని వారు కోరారు. సమావేశ ఉన్నట్టు కనీసం రైతులకు చెప్పకుండా వచ్చిన రైతులకు కూడా ఎటువంటి ఏర్పాటు చేయకుండా పైగా రైతులకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎమ్మార్వో దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని వారు అన్నారు. ఒక పక్క జిల్లాకు చెందిన మంత్రులు అలైన్మెంట్‌ మార్పును పున పరిశీలించాలని అంటున్నాప్పటికి మరోపక్క అధికారులు ఈ పద్ధతిని అనుసరించడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వాలు కూడా రైతులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లో పెట్టి అక్రమ పద్ధతిలో సర్వే నిర్వహించారని వారు గుర్తు చేశారు నూతనంగా అధికారులు వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలని గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రైతులకు అలైన్మెంట్‌ మార్పు చేయాలని వారు అన్నారు. ఈ ఆందోళనకు సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథ మండల కార్యదర్శి కేలోతు లక్ష్మణ్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భూ నిర్వాసిత జేఏసీ నాయకులు మందనపు రవీందర్‌, నాదెండ్ల శ్రీధర్‌, నల్లమోతు శ్రీను, ఎండపల్లి జగన్మోహన్‌, కిషోర్‌, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.