ఇంజినీరింగ్‌లో 70,627 మందికి సీట్ల కేటాయింపు

Allotment of seats to 70627 in Engineering– ఇంకా మిగిలిన 13,139 సీట్లు
– కాలేజీల్లో చేరే గడువు 12
– ఎంసెట్‌ తుదివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో బుధవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 174 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 83,766 సీట్లున్నాయని వివరించారు. వాటిలో తుదివిడత కౌన్సెలింగ్‌ నాటికి 70,627 (84.31 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు.
ఇంకా 13,139 (15.69 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. రెండోవిడత నాటికి 62,738 మంది అభ్యర్థులు కాలేజీల్లో చేరారని వివరించారు.
తుదివిడతలో 21,028 సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, 7,889 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయక పోవడం వల్ల 2,575 మందికి సీట్లు కేటాయిం చలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 5,480 మంది అభ్యర్థులు సీట్లు పొందారని వివరించారు. మూడు విశ్వవిద్యాలయ, 27 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 30 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.
అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనీ, ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని కోరారు. ఈనెల 11 వరకు వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.
ఈనెల 12 నాటికి కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని తెలిపారు. లేదంటే కేటాయించిన సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపు, ఇతర వివరాలకు https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈనెల 17 నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కంప్యూటర్‌ సైన్స్‌కే ఫుల్‌ డిమాండ్‌
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌, మెకానికల్‌ వంటి కోర్సులకు ఆదరణ తగ్గుతున్నది. వాటిలో చేరేందుకు అభ్యర్థులు ఆసక్తిని కనబరచడం లేదు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల తుదివిడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 56,811 సీట్లుంటే, 53,034 (93.35 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వాకాటి కరుణ తెలిపారు. 3,777 (6.65 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో 17,567 సీట్లకుగాను 13,417 (76.38 శాతం) మందికి కేటాయించామని వివరించారు. ఇంకా 4,150 (23.62 శాతం) సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 8,187 సీట్లుంటే 3,457 (42.23 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 4,730 (57.77 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 1,209 సీట్లకుగాను 719 (59.47 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా 490 (40.53 శాతం) సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు