జైన్‌భవన్‌కు రెండెకరాలు కేటాయింపు

– మహావీర్‌ ఆస్పత్రి లీజు ఉచితం
– సీఎం కేసీఆర్‌ను కలిసిన జైన్‌ మతపెద్దలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలోని పలు ప్రాంతాలు, విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు రాష్ట్రంలో సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారంజైన మత పెద్దలు ఆయనతో సమావేశమయ్యారు. తమ మైనార్టీ హక్కులను గుర్తిస్తూ, కమిషన్‌లో ప్రాతినిధ్యం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జైన మత పెద్దల కోరిక మేరకు జైన్‌ భవన్‌ నిర్మాణానికి ఉప్పల్‌ భగాయత్‌లో రెండెకరాల భూమిని కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అలాగే మాసబ్‌ట్యాంక్‌లోని మహావీర్‌ ఆస్పత్రి లీజు స్థలాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు. దీనికి జైన మతపెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ వారితో ముచ్చటించారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ జైన్‌ సేవా సంఫ్‌ు చైర్మెన్‌ అశోక్‌ బర్మేచా, ప్రెసిడెంట్‌ యోగేష్‌ జైన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ సంచతి, సెక్రటరీ జీమురా, జైన్‌ రత్న అవార్డు గ్రహీత, ఫౌండర్‌ సెక్రటరీ సురేందర్‌ లోనియా, మహావీర్‌ హాస్పటల్‌ మాజీ చైర్మెన్‌ మోతీలాల్‌ జైన్‌, మాజీ అధ్యక్షులు గౌతం లోడ, మాజీ కార్యదర్శి బసంత్‌, మాజీ అధ్యక్షులు గౌతంచంద్‌ జైన్‌, జువెల్లరీ అసోసియేషన్‌ అధ్యక్షులు అశోక్‌ షెర్మల్‌ జైన్‌, జయప్రకాష్‌ బాంగడ్‌, హిమాన్షు, తలసాని సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.