ఆర్టీసీలకు విద్యుత్‌ బస్సుల సేకరణ అవకాశం ఇవ్వండి

– పీపీపీ విధానంతో ఎస్టీయూల మూసివేత
– కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎస్‌టీయూ)లకు విద్యుత్‌ బస్సుల సేకరణ, నిర్వహణ అవకాశాలు కల్పించాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసింది. ఇటీవలి కేంద్ర మంత్రిమండలిలో ప్రధాన మంత్రి ఈ-బస్‌ సేవా పథకం కింద 169 నగరాల్లో రూ. 57,613 కోట్ల వ్యయంతో పదివేల ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నడపాలని తీసుకున్న నిర్ణయాన్ని లేఖలో ప్రస్తావించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 37,613 కోట్లు సమాకూర్చాలని ప్రతిపాదించారని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య తెలిపారు. అయితే దేశంలోని ప్రజలకు అతితక్కువ ఖర్చుతో, ప్రజారవాణాను అందిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్ని కాదని, ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తూ పీపీపీ పద్ధతితో అనుమతులు ఇవ్వడాన్ని ఆ లేఖలో తప్పుపట్టారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు (ఎస్టీయూ) కూడా ఈ-బస్సుల సేకరణ, నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కింద దేశంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, ప్రజలకూ మెరుగైన, చౌకైన ప్రజారవాణా లభిస్తుందని విశ్లేషించారు. ఇప్పటికే ఎఫ్‌ఏఎమ్‌ఈ-1,2 స్కీంల క్రింద ఎలక్ట్రిక్‌ బస్సులు జీసీసీ మోడల్‌లో నడపబడుతున్నాయనీ, ఫలితంగా ఇవి ఎస్టీయూలకు తెల్లఏనుగులుగా మారిన అనుభవాలు ఉన్నాయని తెలిపారు. 1950 ఆర్టీసీ చట్టం ప్రకారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలచే ఏర్పాటు చేయబడ్డాయనీ. పట్టణ, గ్రామీణ, కొండ మరియు అంతర్గత గ్రామాలు సహా అన్ని ప్రాంతాల ప్రజలకు సరసమైన టిక్కెట్‌ ఛార్జీలతో బస్సు సేవలను అందిస్తున్నాయని వివరించారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం అన్ని పన్నులను ఖజానాకు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. తక్కువ ప్రమాద రేటు, తక్కువ చమురు వినియోగం ఎస్టీయూలో ఉన్నదన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ రోడ్డు రవాణా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి, బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పీపీపీ విధానంలో ఎలక్ట్రిక్‌ బస్సుల్ని నడపాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో ఎస్టీయూలు ఆర్థికంగా మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు.