– పలుమార్లు కోరినా అవే హామీలు
– జీవో ఉన్నా అమలు చేయని వైనం
– పది రోజులుగా ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ డాక్టర్ల ధర్నాలు
– పట్టించుకోని ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకవైపు వైద్యరంగం అనేక కొలమానాల్లో దేశ, విదేశాల్లో కీర్తిని సంపాదించుకుంటుంది. అదే సమయంలో ఆ రంగంలో వివిధ కేడర్లలో పని చేసే సిబ్బంది, ఉద్యోగులు, విద్యార్థులు పదే పదే తమ డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పడుతున్నారు. అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 15 శాతం చొప్పున ఉపకార వేతనాలు పెంచాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అల్లోపతి వైద్యవిద్యార్థులకు పెంచినప్పటికీ ఆయుర్వేద, హౌమియో, యునానీ, నేచురోపతి తదితర ఆయుష్ వైద్యవిద్యార్థులకు మాత్రం పెంచలేదు. దీంతో పదేండ్ల క్రితం ఉన్న ఉపకార వేతనాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.
ఈ విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఆ శాఖలోని ఉన్నతాధికారులకు పదే పదే విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేసిన సీహెచ్.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌తో పాటు ప్రస్తుత వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు విన్నవించుకున్నారు. సరిపోనీ ఉపకారవేతనం, మరో వైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయుష్ విద్యార్థులు ఆయా ఆస్పత్రుల్లో తమ నిరసన తెలిపేందుకు విధులను బహిష్కరించి ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రి, చార్మినార్ టిబ్బీ యునానీ ఆస్పత్రి, బేగంపేటలోని నేచురోపతి ఆస్పత్రి, రామాంతపూర్‌లోని హౌమియో ఆస్పత్రితో పాటు వరంగల్ జిల్లాలోని ఆయుర్వేద ఆస్పత్రిలోని పీజీలు, హౌస్ సర్జన్లు ధర్నా బాట పట్టారు. దాదాపు 600 మంది పీజీలు, హౌస్ సర్జన్లు లేకపోవడంతో ఆయుష్ సేవలకు విఘాతం కలుగుతున్నది.
ఆయుష్ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలిక రోగులే ఉండటం గమనార్హం. దీంతో చికిత్స అనివార్యంగా చివరి వరకు కొనసాగించే క్రమంలో రెగ్యులర్‌గా వస్తుంటారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ఇలాంటి వారికి సేవలందించేందుకు పరిమిత సంఖ్యలో ఉన్న డాక్టర్లపై భారం పడుతున్నాయి. మరోవైపు రోగులకు సకాలంలో వైద్యసేవలందక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గత 10 రోజులుగా ధర్నాలు చేస్తున్నా …. అధికారులు, ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో రోగులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉపకారవేతనాలు చాలక ఆయుష్ వైద్య విద్యార్థులు, మరోవైపు మెరుగైన సేవలు దొరకక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యవిద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.