ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికలు రూపొందించాలి

Alternative financial plans should be made– ప్రతిపక్షాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి :ఎస్వీకే వెబినార్‌లో ఆర్థికరంగ విశ్లేషకులు డీ పాపారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ ఆర్ధిక విధానాలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని ప్రముఖ ఆర్ధికరంగ విశ్లేషకులు డీ పాపారావు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో వాటిపై చర్చ జరిగితేనే చైతన్యవంతులు అవుతారనీ, ఆ బాధ్యతల్ని ప్రతిపక్ష రాజకీయపార్టీలు తీసుకోవాలని సూచించారు. గురువారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ప్రయివేటు రంగానికి గనులు, ఖనిజాలు పార్లమెంటు ఆమోదం-పర్యవసానాలు’ అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు మణిపూర్‌ సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో, దాన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నదని తెలిపారు. దేశానికి, దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ (ఎల్పీజీ)ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఇప్పటికే 95 రకాల మినరల్స్‌ ఉంటే, వాటిని లైసెన్స్‌డ్‌ కాలంలో సక్రమంగా వినియోగించుకోలేకపోయామనే వాదనలు ఉన్నాయని చెప్పారు. జాతీయ భద్రత కోసం ఈ ఖనిజాలను ప్రభుత్వమే వినియోగించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో బ్యాటరీల తయారీకి విదేశాలపై ఆధారపడకుండా, స్వదేశంలోని ఖనిజాలను వినియోగించుకోవాలని నిర్ణయించారన్నారు. అయితే ఇవి ఎంతమాత్రం స్వదేశీ విధానాలు కావన్నారు. పైగా స్వదేశంలోని చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తలు తీవ్రంగా దెబ్బతిన్నారని విశ్లేషించారు. కేవలం అదానీ, అంబానీలను మాత్రమే పోషిస్తున్నారని చెప్పారు. ఆదానీకి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు గనులు ఇప్పించేందుకు స్వయంగా ప్రధానమంత్రే ఎస్‌బీఐ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆర్థికవనరులు, దేశసంపదను కొద్దిమందికి కొల్లగొట్టి, అప్పగించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాపత్రయపడుతున్నదనీ, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రయివేటురంగం పర్యావరణాన్ని పట్టించుకోదనీ, దానికి కేవలం లాభాలు మాత్రమే కావాలన్నారు. ప్రపంచం గ్లోబల్‌ వార్మింగ్‌ దశ నుంచి గ్లోబల్‌ బాయిలింగ్‌ దశకు చేరినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని తెలిపారు. దేశంలోకి కొత్తగా ఎలాంటి పరిశ్రమలు, పెట్టుబడులు రావట్లేదని చెప్పారు. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో మైనింగ్‌ మాఫియా విజృంభిస్తున్నదనీ, ఆకలి, దారిద్య్రంతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. అమెరికా వంటి దేశంలో ప్రస్తుతం మార్కెట్‌ విధానం వెళ్లిపోయి, పారిశ్రామిక విధానాలు అమల్లోకి వస్తున్నాయనీ, చైనాతో పోటీని తట్టుకొని నిలబడాలంటే అమెరికాకు అది అవసరమని విశ్లేషించారు. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ పాత్ర పెరగాలని అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్లు ముందుకొసున్నాయని చెప్పారు. సోవియట్‌ యూనియన్‌లోని లేబర్‌ ప్లానింగ్‌ విధానం ఇప్పుడు ప్రపంచానికి అవసరం అనీ, ఆర్థికవేత్తలు దీనిపై దృష్టి పెట్టాలని ‘మింట్‌’ పత్రిక పేర్కొందని ఉదహరించారు. హిమాలయాల్లో మంచు కరిగిపోయి, తీవ్రమైన పర్యావరణ విఘాతం జరుగుతున్న సమయంలో గనుల్ని ప్రయివేటుకు అప్పగించడం పెను ప్రమాదాలను సూచిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.