అంబరాన్ని అంటేలా నేడు గిరిజనోత్సవ సంబురాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దశాబ్దిఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవ సంబురాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర స్ధాయిలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్వవతి రాధోడ్‌ , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని ఆయా గిరిజన గ్రామాల్లో సభలు జరగనున్నాయి. గత తొమ్మిదేండ్లలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్‌ 10 శాతం పెంచిన విషయాన్ని ఉత్సవాల్లో ప్రముఖంగా ప్రసావిస్తారు. హైదరాబాద్‌లో బంజారా భవన్‌, ఆదివాసి భవన్‌ నిర్మాణం, కుమ్రంభీం జయంతి, సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి, సమ్మక్క సారక్క జాతర, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును, వివిధ జాతరలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం, తదితర వివరాలను ఈ కార్యక్రమాల్లో వెల్లడిస్తారు.
గిరిజనులకు ” స్వర్ణ యుగం” మే..
పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సర్కారు సన్నద్దమవుతున్నది. అందుకు తగిన విధంగా పట్టాపుస్తకాలను ముద్రిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలనే డిమాండ్‌ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. పెరిగిన జనాభాకు అను గుణంగా రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతానికి పెంచ డం వంటి విప్లవాత్మక నిర్ణయాల ద్వారా విద్య ఉద్యోగ రంగా ల్లో గణనీయమైన మార్పునకు ప్రభుత్వం నాంది పలికింది.
సమగ్రాభివృద్ధికి కృషి..
‘పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల సమగ్రాభివద్ధికి నిష్పక్ష పాతంగా ప్రభుత్వం కషిచేస్తున్నది. భారీ స్థాయిలో నిధుల కేటాయించింది. ఎన్నో దశాబ్దాల అణచివేతకు, ఆర్ధికంగా వెనుకబాటుకు గురైన ఆదివాసీలు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచింది. వారి సమగ్రాభివద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పా టు చేసింది. ప్రాధాన్యతా క్రమంలో వాటిని ఖర్చు చేస్తున్నది. గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలోని 3,146 తండాలు, గూడేలకు గ్రామపంచాయతీ హోదా కల్పించింది. ఆయా పంచాయతీల్లో రూ.1,897.08 కోట్లతో పలు అభివద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామపం చాయతీ భవనాల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు ఎమ్‌ ఎఎస్డీఎఫ్‌ కింద ప్రత్యేక నిధులను ఈ ఏడాది కేటాయించింది.
విద్యాభివృద్ధికోసం కృషి..
గిరిజన విద్యార్థుల కోసం దేశంలో ఎక్కడా. లేనివిధంగా ప్రత్యేకంగా 92 గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. వీటిలో రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు, ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలు, లా కాలేజీలు, సైనిక్‌ స్కూల్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్టెన్స్‌ సహా పలు విద్యా సంస్థలను నెలకొల్పింది. గురుకుల భవనాల నిర్మాణా నికి రూ. 292 కోట్లు కేటాయించింది. గురుకులాల్లో శిక్షణ పొందిన వందలాది మంది ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకున్న వారికి ఒక్కొ క్కరికి రూ.20 లక్షల చొప్పున రూ.33.49 కోట్లను సర్కారు అందజేసింది. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు సంభవించినప్పుడు వైద్యసిబ్బందిని అప్రమత్తంగా ఉంచటమే కాక..ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నదని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్‌ తెలిపారు.