దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

– మనువాదుల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– ప్రజాకవి జయరాజుపై మతోన్మాదుల దాడికి ఖండిస్తూ సదస్సు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్నదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా కవి జయరాజుకు మద్దతుగా ‘మతోన్మాదుల దాడిని ఖండిద్దాం జయరాజుకు మద్దతుగా నిలబడదాం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. జీవితానికి ఎలాంటి లక్ష్యాలు లేకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేసేందుకు పాల్పడుతున్న మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మనుస్మృతిని వ్యతిరేకించి దాని ప్రతులను తగులబెట్టిన అంబేద్కర్‌ను సైతం నేడు మనువాదులు సొంతం చేసుకునేందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు. మానవులు ప్రకృతి నుంచే వచ్చారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలసుకోవాలన్నారు. ప్రకృతిని ప్రేమించిన వాడు కచ్చితంగా మనుషులను ప్రేమిస్తాడన్నారు. మనువాదులు మాట్లాడే మురికి భాషను వింటుంటే నరహంతక ముఠా నాయకుడు నయీం వారసత్వాన్ని మనువాదులు అందిపుచ్చుకున్నట్టుగా ఉందని తెలిపారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు జి. రాములు, మాట్లాడుతూ.. తెలంగాణలో భావజాల దాడి పెరిగిపోయిందని, ఈ దాడిని వామపక్షవాదులు ఐక్యంగా సమూహంగా తిప్పికొట్టి ప్రత్యామ్నాయ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు జయరాజును కాపాడుకుంటారన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. అలాగే సదస్సులో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ప్రధాన కార్యదర్శి కే హిమబిందు, కెేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్‌ వెస్లీ, స్కైలాబ్‌ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, ప్రముఖ కళాకారులు అంబిక, మచ్చ దేవేందర్‌, సామాజిక మేధావి డాక్టర్‌ జిలకర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని జయరాజుకు సంఘీభావం ప్రకటించారు.