ఇంకా న్యాయానికి చోటుందని నిరూపించింది

బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ ఆంగ్ల పత్రికలు ప్రశంసలు కురిపించాయి. న్యాయాన్ని కాపాడడంలో సుప్రీంకోర్టు నిర్వహించిన పాత్రను తమ– సుప్రీం తీర్పుపై జాతీయ పత్రికల ప్రశంసలు
– రాష్ట్ర ప్రభుత్వం దోషులకు సహకరించింది
– అధికార దుర్వినియోగానికి పాల్పడింది
– ఈ తీర్పు సర్కారుకు చెంపపెట్టే

బిల్కిస్‌ బానోతోపాటు దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ సీపీఐ(ఎం) నేత సుభాషిణీ అలీ, విద్యావేత్త ప్రొ. రూప్‌ లేఖ వర్మ, జర్నలిస్టు రేవతిలాల్‌, తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రీ, మాజీ ఐపీఎస్‌ అధికారి మీరాన్‌ చద్దా బోర్వాంకర్‌ తదితరులు సుప్రీంకోర్టులో పిటీషన్‌లు దాఖలు చేశారు. చివరి వరకూ బాధితురాలికి సంఘీభావంగా నిలిచారు.
న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ ఆంగ్ల పత్రికలు ప్రశంసలు కురిపించాయి. న్యాయాన్ని కాపాడడంలో సుప్రీంకోర్టు నిర్వహించిన పాత్రను తమ సంపాదకీయాలలో కొనియాడాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. రాజకీయ ప్రయోజనాల కంటే చట్టానికే ప్రాధాన్యత లభించిందని వ్యాఖ్యానించాయి.
సుప్రీం తీర్పుపై వివిధ ఆంగ్ల పత్రికలు తమ సంపాదకీయాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు….
దిద్దుబాటు చర్య హిందుస్థాన్‌ టైమ్స్‌
సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగిన దిద్దుబాటు చర్య. దోషులను విడుదల చేసినప్పుడు వారిని బహిరంగంగా సత్కరించడం, వారికి లభించిన ఊరట న్యాయ వ్యవస్థకు మచ్చ లాంటిది. సుప్రీంకోర్టు రికార్డుపై కూడా అది నీడలా కమ్మేసింది. దోషులకు మోసం ద్వారా ఉపశమనం లభించిందని సుప్రీం తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం, మునుపటి బెంచ్‌ తగిన శ్రద్ధ చూపలేదు. జీవిత ఖైదు అనుభవించే వారికి ఉపశమనం కల్పించడం అసాధారణమేమీ కాదు. అయితే హత్య, అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారికి చాలా అరుదుగా ఉపశమనాలు లభిస్తాయి. బానో, ఆమె కుటుంబం న్యాయం కోసం ధైర్యంగా, అలుపెరుగని పోరాటం చేశాయి. ఈ పోరాటం ఇలాగే కొనసాగాలి.
లక్షలాది సంఘీభావాలకు అక్షరాభివందనాలు
(2002లో బిల్కిస్‌ బానో మీద అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని హత్య చేసిన కేసులో శిక్ష పడిన 11 మంది దోషులకు క్షమాభిక్షను కొట్టివేస్తూ జస్టిస్‌ బి వి నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ల సుప్రీం కోర్టు బెంచి ఇచ్చిన తీర్పు తర్వాత నాకివాళే నిజంగా నూతన సంవత్సరాది. ఇవాళ నేను ఉపశమనంతో కన్నీళ్లు కార్చాను. ఏడాదిన్నరలో మొదటిసారి చిరునవ్వు నవ్వాను. నా పిల్లలను అక్కున చేర్చుకున్నాను. నా గుండెల మీద ఉన్న పర్వతమంత బండరాయి తొలగిపోయినట్టుగా ఉంది. మళ్లీ ఊపిరి పీలుస్తున్నాను. న్యాయమంటే ఈ అనుభూతే కదా. నాకూ, నా పిల్లలకూ, అన్ని చోట్లా స్త్రీలందరికీ ఈ తీర్పు ఇచ్చినందుకు, అందరికీ సమాన న్యాయం దక్కుతుందనే వాగ్దానాన్ని, ఆశను నిలిపినందుకు గౌరవ భారత సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేనిదివరకు చెప్పిందే, మళ్లీ ఇవాళ కూడా చెపుతున్నాను. నేను చేసిన లాంటి ప్రయాణం ఎవరూ ఒంటరిగా చేయజాలరు. నా ప్రయాణమంతా నా భర్తా, నా పిల్లలూ నా వెంట ఉన్నారు. చుట్టూ పరుచుకున్న ద్వేషం మధ్య ఎందరెందరో స్నేహితులు నాకు ప్రేమను పంచారు. కష్టభరితమైన సమయాల్లో నా చెయ్యి పట్టుకున్నారు. నాకు దొరికిన అసాధారణమైన న్యాయవాది శోభా గుప్తా గత 20 సంవత్సరాలుగా స్థిరంగా నాతో నడిచారు. న్యాయ భావన పట్ల ఏ ఒక్క క్షణమూ నన్ను ఆశ వదులుకోనివ్వలేదు. నా కుటుంబాన్ని ధ్వంసం చేసిన, నా అస్తిత్వాన్నే భయోత్పాతంలో ముంచినవాళ్లు ఏడాదిన్నర కింద, 2022 ఆగస్ట్‌ 15న, ముందస్తుగా విడుదలయ్యారు. నేను కుప్పకూలిపోయాను. నా ధైర్యపు నిలువలన్నీ అడుగంటిపోయాయి. అప్పుడు లక్షలాది సంఘీభావాలు నావైపుగా తరలివచ్చాయి. వేలాది మంది భారతీయులు, స్త్రీలు ముందుకు వచ్చారు. వాళ్లు నాతోపాటు నిలిచారు, నా కోసం మాట్లాడారు. నా కోసం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. దేశవ్యాప్తంగా ఆరు వేల మంది, ఒక్క ముంబాయి నుంచే 8500 మంది నా కోసం విజ్ఞప్తులు చేశారు. పదివేల మంది బహిరంగ లేఖ రాశారు. కర్ణాటకలోని 29 జిల్లాల నుంచి 40,000 మంది బహిరంగ లేఖ రాశారు. వారందరూ ప్రకటించిన సంఘీభావానికీ, నాకు ఇచ్చిన శక్తికీ వారిలో ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరే నాలో పోరాట సంకల్పాన్ని బలోపేతం చేశారు. నా ఒక్కదాని కోసం మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ఒక్క స్త్రీ కోసమూ న్యాయ భావనను పునరుద్ధరించారు. ధన్యవాదాలు. నా సొంత జీవితంలో, నా పిల్లల జీవితాల్లో ఈ తీర్పుకు సంపూర్ణ అర్థాలేమిటో ఇంకా గ్రహిస్తూనే ఉన్నాను గాని, ఇవాళ నా హదయం లోంచి ఒక సరళమైన ప్రార్థన పైకి ఎగుస్తున్నది. అది, చట్టబద్ధ పాలన, దాని కన్న ముఖ్యంగా చట్టం ఎదుట సమానత్వం అందరికీ అందాలనేదే.
బిల్కిస్‌ బానో, జనవరి 8, 2024 (న్యాయవాది శోభా గుప్తా ద్వారా) (తెలుగు: ఎన్‌ వేణుగోపాల్‌)
మానవత్వం, సమానత్వ భావనలకు బలం ది టెలిగ్రాఫ్‌
21 సంవత్సరాల బిల్కిస్‌ బానో ఐదు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన వారికి న్యాయస్థానం విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించడంతో విద్వేష రాజకీయాలకు, హింసకే విజయం లభించిందన్న భావన వ్యక్తమైంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలలో పదును చూస్తుంటే ఇటీవలి సంవత్సరాలలో దేశంలో చట్టమనేదే లేదన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. నేర స్వభావం దిగ్భ్రాంతి కలిగిం చింది. చాలా మందికి ఆందోళన కలిగించింది. అత్యాచార కేసులలో సాక్షులను, బాధితులను బెదిరించడం, కొన్ని సందర్భాలలో హతమార్చడం సర్వసాధారణమై పోయింది. అణచివేత ప్రయత్నాలకు రాజ్యం మద్దతుగా నిలవడం ప్రజలలో భయాన్ని, కోపాన్ని, అపనమ్మకాన్ని కలిగించింది. హింసా రాజకీయాలకు, లింగ సంబంధమైన విద్వేషాలకు, సాంస్కృతిక ఆధిపత్యానికి మహిళలే సహజంగా లక్ష్యాలుగా మారుతున్నారు. బిల్కిస్‌ బానో దానికో ఉదాహరణ. ఆమె కూడా మైనారిటీ మహిళే. ఈ కారణాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుకు బలం చేకూర్చాయి. మానవత్వం, సమానత్వం అరుదుగా కన్పిస్తున్న ఈ కాలంలో ఈ తీర్పు ఆ భావనలకు బలం చేకూర్చింది.
రాజకీయ
అవసరాలకు వాడకూడదు ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
అన్ని కేసులలోనూ విధానపరమైన భద్రత అవసరం. న్యాయ వ్యవస్థలో ఉపశమనం అనేది అంతర్భాగం. అయితే దానిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించకూడదు. దోషుల శిక్షాకాలాన్ని తగ్గించడంలో గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పక్షపాతపూరితమైన నిర్బంధాల ద్వారానే కాదు…సందేహాస్పదమైన ఉపశమన చర్యల ద్వారా కూడా న్యాయం లభించదు. భయానకమైన నేర స్వభావం
కారణంగా దోషులకు కల్పించిన ఉపశమనం వివాదాస్పదమైంది. నేర స్వభావం భయానకమైనది కాబట్టే నిందితులకు జీవిత ఖైదు పడింది.
ప్రభుత్వానికి అభిశంసనే : ది హిందూ

న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్‌ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ తన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం దోషులకు సహకరించిందని తెలిపింది. ప్రభుత్వం దోషులతో కలిసి చట్టాన్ని ఉల్లంఘించిందని, అధికార దుర్విని యోగానికి పాల్పడిందని పేర్కొంది. సుప్రీం తీర్పు నిస్సందేహంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించింది. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు. వ్యవస్థల సామర్ధ్యంపై అనుమానాలు రేకెత్తుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించింది. శిక్షాకాలం పూర్తి కాకముందే దోషులకు ఉపశమనం కల్పించడాన్ని వ్యక్తిగతంగా పరిశీలించాల్సి ఉంటుంది. వారికి స్వేచ్ఛ ప్రసాదిస్తే బాధితులపై, సమాజంపై పడే ప్రభావాన్ని పరిశీలించకుండా నిర్ణయం తీసుకోకూడదు. మానవతను పరిగణనలోకి తీసుకొని ఉపశమన విధానాన్ని రూపొందించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించకుండా, సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ కేసులో ఆ నిబంధనలేవీ పాటించలేదు.