పురుషాధిక్య సమాజంలో మహిళలను కించ పరిచే కొన్ని పదాలను అందరూ సర్వసాధారణంగా వాడుతుంటారు. అయితే ఇకపై అలాంటి పదాలు నిషేధిస్తూ సుప్రీం కోర్ట్ ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆ పదాలు ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో, ఆ పదాలు స్త్రీల వ్యక్తిత్వాన్ని ఎలా తగ్గిస్తున్నాయో వివరిస్తూ ఒక హ్యాండ్ బుక్‌ను కూడా విడుదల చేసింది. ఇకపై కోర్టుల్లో మహిళల గురించి ప్రస్తావించేటపుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించ కూడదని ఈ పుస్తకంలో స్పష్టం చేసింది. ఆ వివరాలేంటే తెలుసుకుందాం…
ఇటీవల దేశంలోని న్యాయవాదులు, న్యాయ మూర్తులు న్యాయపరమైన సంభాషణలో ఉపయోగించే పదాలు, పదబంధాలలో ప్రతి బింబించే ”పితృస్వామ్య అండర్ టోన్‌లతో కూడిన పురాతన ఆలోచనలను” తొలగించే ప్రయత్నంలో 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఉంపుడుగత్తె, వేశ్య, పవిత్ర మహిళ, అత్యాచారం వంటి పదాలు మహిళలను కించ పరిచే విధంగా ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయ వాదులు ఈ మార్పు వల్ల మహిళలపై దాడులకు పాల్పడిన వారి నేరాలు పలుచన చేయవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే జస్టిస్ చంద్రచూడ్ హ్యాండ్‌బుక్‌లో ఈ పదాలు సాంస్కృతిక, సామాజిక పరిస్థితులలో ఎలా ప్రవేశిస్తాయో వివరించారు.
స్త్రీల వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి
”ఒక మహిళ ఎంపికలు (ఉదా… ఆమె ధరించే బట్టలు), లైంగిక చరిత్ర ఆధారంగా ఆమె ప్రవర్తన గురించి ఊహించుకుం టుంటాం. న్యాయ విచారణలో ఆమె చర్యలు, ప్రకటనలు ఎలా అంచనా వేయబడతాయో కూడా ప్రభావితం చేయవచ్చు. స్త్రీ పాత్ర, ఆమె ధరించే దుస్తులపై ఆధారపడిన ఊహలు, లైంగిక సంబంధాలలో సమ్మతి ప్రాముఖ్యతను అలాగే స్త్రీల వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి. సాధారణంగా స్త్రీలను లైంగి కంగా వేధించే పురుషులు అపరిచితులు, వారు స్త్రీకి తెలియదు అని అనుకుంటాం. వాస్తవానికి పురుషులు తమకు తెలిసిన స్త్రీని లైంగికంగా వేధిస్తారు. స్త్రీ సహోద్యోగి, యజమాని, ఉద్యోగి, పొరుగువారు, కుటుంబ సభ్యులు, స్నేహితురాలు ఇలా ఎవరైనాకావచ్చు. అలాగే అణగారిన కులాల స్త్రీలతో పురుషులు లైంగిక సంబంధాలలో పాల్గొనడానికి ఇష్టపడరు అని ప్రచారంలో వుంది. కానీ నిజానికి లైంగిక హింస చాలా కాలంగా సామాజిక నియంత్రణ సాధనంగా ఉపయోగించబడు తున్నాయి. ఆధిపత్య కుల పురుషులు లైంగిక హింసను కులాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయో గించారు” అని ఈ హ్యాండ్ బుక్‌లో జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు.
చట్టాలను ఆసరా చేసుకుని
చెన్నైకి చెందిన చిత్ర నిర్మాత, కుల వ్యతిరేక ఉద్యమకారిణి దివ్య భారతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన పక్షపాతాలే కొన్నేండ్ల కిందట నన్ను లా ప్రాక్టీస్‌ను విడిచిపెట్టేలా చేశాయి. చట్టాలను ఆసరా చేసుకుని కులం, లింగ వివక్ష ఇప్పటికీ ప్రధాన నమ్మకాలు ఉన్నాయి. ఇవి అధికార దుర్విని యోగానికి దారితీస్తాయి. అట్టడుగు వర్గా లను అట్టడుగున ఉంచే సామాజిక నిబంధ నలను శాశ్వతం చేస్తాయి. కోర్టులలో మహిళలు, లింగ వివక్ష, లైంగికతపై చాలా మూర్ఖపు అభిప్రాయాలు కొన సాగుతున్నాయి. ఈ హ్యాండ్‌బుక్ ఒక ప్రారంభం అయితే మరిన్ని మార్పుల కోసం కఠినమైన, నిరంతర ప్రయత్నాలు అవసరం” ఆని చెప్పారు.
వారి దృష్టిలో ఇవి నేరాలు కావు
1992లో రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ సామాజిక కార్యకర్త భన్వారీ దేవి బాల్య వివాహాన్ని నిరోధించేం దుకు కృషి చేస్తున్నారు. అణగారిన కులానికి చెందిన తనపై అనేక మంది ఆధిపత్య కులాల వారు లైంగికంగా దాడి చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. 1995లో ఈ పరిశీలనల ఆధారంగా ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఎందుకంటే ఆధిపత్య కులానికి చెందిన వారు అణగారిన కులానికి చెందిన మహిళపై లైంగిక దాడి చేయరు, వృద్ధులు సామూహిక లైంగిక దాడిలో పాల్గొనరు, ఒక స్త్రీ తన భర్త సమక్షంలో లైంగికదాడికి గురికావడం అసంభవం వంటి నమ్మకాలు మన దగ్గర ఉన్నాయి. ఏప్రిల్ 2021లో గౌహతి పోలీసులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గౌహతికి చెందిన ఒక విద్యార్థిని అరెస్టు చేశారు. ఒక మహిళా విద్యార్థినితో బలవంతంగా మద్యం తాగింగి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే దీనికి కారణం. ఆ ఏడాది ఆగస్టులో గౌహతి హైకోర్టు ‘సాంకేతిక కోర్సును అభ్యసిస్తున్న ప్రతిభావంతుడైన విద్యార్థి, దేశానికి అతను గొప్ప ఆస్తి’ అనే కారణంతో అతనికి బెయిల్ మంజూరు చేసింది. అదే నెలలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ భర్త తన భార్యపై లైంగిక దాడికి పాల్పడితే నిర్దోషిగా ప్రకటించింది. ఐపీసీ సెక్షన్ 375 కింద ‘ఒక వ్యక్తి తన భార్యకు 15 ఏండ్లు దాటినట్లయితే ఆమెతో బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా దాన్ని దాడిగా పరిగణించరు.
ఆలోచనల్లో మార్పు రావాలి
న్యాయవాది, మహిళా హక్కుల పోరాట యోధురాలు సుధా రామలింగం మాట్లాడుతూ ‘న్యాయవ్యవస్థ లోతుగా పాతుకుపోయిన వివక్ష, పితృ స్వామ్యంతో నిండి ఉంది. దానిని అలాగే ఉంచే నిబంధనల గురించి మాట్లాడేముందు న్యాయ వాదులు, న్యాయమూర్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ హ్యాండ్ బుక్ చేస్తుంది. మహిళ లపై జరుగుతున్న మాటల దాడులను మార్చే దిశలో హ్యాండ్‌బుక్ ఒక చిన్న అడుగు మాత్రమే. ఇది విప్లవం కాదు. వరకట్నానికి వ్యతిరేకంగా చట్టం ఉన్నప్పటికీ అది ఎలా నిరాటంకంగా కొనసాగుతోందో ఇదీ అంతే. ఆలోచనా ధోర ణుల్లో మార్పు సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి” అంటున్నారు.
ఆచరణలోకి రావాలంటే…
”హ్యాండ్‌బుక్ ఒక ముఖ్య మైన మార్గదర్శకం. ఇందులో ఎటు వంటి సందేహం లేదు. కానీ అది ఆచరణలోకి రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలలకు, పోలీసులకు ఇది చేరుకోవాలి. చట్టపరమైన సోదరభావాన్ని సున్నితం చేయాలి. న్యాయపరమైన పాత్రల కోసం రిక్రూట్ మెంట్ ప్రక్రియలు ప్రావీణ్యం పొందాలి. ఎస్‌ఐఏఏపీ మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, సెక్స్ వర్కర్లతో సన్నిహితంగా పనిచేస్తోంది. వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పిస్తోంది. వారికి భద్రత, ఆరోగ్య సంరక్షణ కల్పించడంలో సహాయం చేస్తుంది. స్త్రీల లైంగికతపై పితృస్వామ్య నియంత్రణను విచ్ఛిన్నం చేయడం, మహిళలు తమ శరీరాలను వారు కోరుకున్న విధంగా ఉపయోగిం చుకునే సామర్థ్యాన్ని, ఎంపిక శక్తిని పునరుద్ధ రించే ఉద్దేశ్యంతో పరి భాషలో వ్యత్యాసం చేయవచ్చు. అయితే ఇది చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌లో ఇప్ప టికే నిర్వచించ బడిన కొన్ని నిబం ధనలను ఉప యోగించు కునే ప్రమాదం ఉందని మానవ హక్కుల కార్యకర్త, హైదరాబాద్‌లోని అక్రమ రవాణా నిరోధక సంస్థ ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ అన్నారు. అలాగే ‘సెక్స్ వర్కర్’ అనే పదాన్ని ఉపయోగించడం కార్మికుల హక్కులు, భద్రత, పన్నుల వంటి సమస్యల సందర్భంలో కార్మికుల ఉద్యమ భావజాలం నుండి కూడా వచ్చింది. నిర్బంధ ఎంపికల కారణంగా వ్యభిచారాన్ని ఎంచుకో వలసి వస్తుంది. అక్రమంగా రవాణా చేయబడిన ఒక మహిళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఉపయోగించలేరు” అని ఆమె అన్నారు. హ్యాండ్‌బుక్‌లో ఈ నిబంధనలు, వాటి అర్థాల గురించి ‘మనసుతో కూడిన అవగాహన’ కోసం కృష్ణన్ సీజేఐకి ఒక లేఖ రాశారు.
లింగ నిర్ధారణ హ్యాండ్‌బుక్ అంటే ఏమిటి?
లింగ మూస పద్ధతు లను ఎదుర్కోవడానికి సుప్రీం కోర్ట్ హ్యాండ్‌బుక్ ‘వేశ్య’, ‘హూకర్’ అనే పదాల స్థానంలో ‘సెక్స్ వర్కర్’తో భర్తీ చేసింది. దీని ద్వారా ఒక పురుషుడు సెక్స్ వర్కర్‌పై లైంగిక దాడి చేయలేడు అనే మూస పద్ధతులను ఛేదించింది. ‘వనరులు, విద్య, ఉపాధిలో సమానమైన అవకాశాలు పొందలేకపోవడం వారిని లైంగిక పనిలోకి నెట్టివేస్తుంది. ఆ తర్వాత వారు మరో జీవితాన్ని ఎంచుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సెక్స్ వర్కర్ కేసు విచారణకు వెళ్లే ఏకైక మార్గం వారిని బాధితులుగా చూడడం. కాబట్టి ‘సెక్స్ వర్కర్’ అనే పదం వారికి కొంత శక్తిని ఇస్తుంది అని సౌత్ ఇండియా ఎయిడ్స్ యాక్షన్ ప్రోగ్రామ్ (ఎస్‌ఐఏఏపీ)కి చెందిన శ్యామలా నటరాజ్ అన్నారు.