ఆర్థిక సహాయం పథకానికి దరఖాస్తు గడువు పెంచాలి

– తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వృత్తికులాలకు ఆర్థిక సహాయం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలనీ, అర్హులైన వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఆధునీకరణ, పనిముట్లు, ముడిసరుకుల కొనుగోలు కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల ఏడో ఆరో తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారని చెప్పారు. దరఖాస్తుదారులు కులం, ఆదాయం, ఆధార్‌, రేషన్‌ కార్డులను జతపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన వారిలో అత్యధికులు నిరక్షరాస్యు లనీ, అందువల్ల సర్టిఫికెట్లను సిద్ధం చేసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో గడువును జూలై 10 వరకు పొడిగించాలని కోరారు.