ఒత్తిడి చేస్తున్నారా..?

Are you under pressure?పిల్లలు వివిధ విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆరాటం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ అత్యుత్సాహంతోనే వారి ఇష్టాయిష్టాలు గ్రహించకుండా కొన్ని విషయాల్లో పేరెంట్స్‌ వాళ్లను బలవంత పెడుతుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకే బలవంతం చేయడం కంటే వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహిస్తే వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా వారు ఉన్నతి సాధించగలరు. మరి దీని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం…
పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులైతే ముందుగా సంతోషపడేది తల్లిదండ్రులే. అయితే వారు నిరంతరం చదువుతూ ఉండడం వల్లే ఇది సాధ్యపడుతుందన్న ఆలోచనలో ఉంటారు కొందరు తల్లిదండ్రులు. అందుకే పదే పదే ‘చదువు..చదువు’ అంటూ వారిపై ఒత్తిడి తెస్తుంటారు. ఇక దీనికి తోడు పిల్లలతో పుస్తకాలు చదివించే అలవాటు చేయాలనుకుంటారు మరికొందరు పేరెంట్స్‌. అయితే చదువు విషయంలో ఇలా పిల్లల్ని బలవంత పెట్టడం వల్ల అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా చదవాలన్న ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
మీరు చదువుతూ…
పిల్లలు చదువులో మెరుగ్గా ఉండాలంటే వారి కోసం ఒక చక్కటి ప్రణాళిక రూపొందించాలి. అందులో వారికి నచ్చిన వ్యాపకాలకు తగిన సమయం కేటాయించేలా శ్రద్ధ చూపాలి. అప్పుడే వారు మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పాఠ్యాంశాల పైన ఆసక్తి పెంచుకోగలుగుతారు. ఇక పిల్లల్లో ఇతర పుస్తకాలు చదివే ఆసక్తిని పెంచాలంటే చిన్న వయసు నుంచే వారికి అలవాటు చేయాలి. అది కూడా మీరు చదువుతూ వారికి చెప్పడం వల్ల చిన్నారులకు పుస్తకాల విలువ తెలుస్తుంది.
నచ్చినా నచ్చకపోయినా
పిల్లల విషయంలో ఈ మొండిపట్టుదల వద్దంటున్నారు నిపుణులు. వారికి ఇష్టమో, కాదా అన్నది తెలుసుకోకుండా ‘నువ్వు ఐఏఎస్‌ అవ్వాలి’, ‘సంగీతం నేర్చుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ తమ ఇష్టాయిష్టాల్ని చిన్నారులపై రుద్దాలని చూస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. ఇలా మీ బలవంతం వల్ల నచ్చని అంశాన్ని ఎంచుకొని పిల్లలు రాణించలేరు. అటు వారికి నచ్చిన అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. దీనివల్ల వారి భవిష్యత్తు ఎటూ కాకుండా తయారవుతుంది. ఇలా కూడా పరోక్షంగా మీకే నష్టం. కాబట్టి మీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి… పిల్లలకు ఏ అంశంపై ఆసక్తి ఉందో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది మీకు నచ్చకపోయినా నిరుత్సాహపరచకుండా వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. దీనివల్ల తప్పకుండా వారు అందులో రాణించగలుగుతారు. ఇలా నచ్చిన రంగాన్ని ఎంచుకొని విజయం సాధించిన వారి స్ఫూర్తి గాథలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.
ఆ పొరపాటు వద్దు
ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లల్ని వారికి తోడుగా ఉండమని చెప్పి వాళ్ల పనుల్లో వాళ్లు నిమగమవుతుంటారు. అక్కడితే ఆగకుండా బలవంతంగా వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వమనడం, ముద్దు పెట్టమనడం, వారు పిల్లలకు పెట్టేంత చొరవనివ్వడం వంటివి చేస్తుంటారు. నిజానికి వీటికి చిన్నారులు అంత ఆసక్తి చూపరు. అయినా బలవంతం చేయడం వల్ల అవతలి వారు మీ పిల్లలతో ఆసభ్యంగా ప్రవర్తించేందుకు, లైంగిక వేధింపులకు గురి చేసేందుకు మీకు మీరే అవకాశం కల్పించినట్లవుతుంది. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించకూడదు. అలాగే మీ చిన్నారులు వాళ్లతో దూరంగా ఉన్నప్పటికీ ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం.