ఢిల్లీకి రాజైనా ఓ అమ్మకు కొడుకే అన్నది ఓ పాత సామెత. ఏడు సామ్రాజ్యాల రాజధాని మరి. ఆమాత్రం సామెతలు పుట్టుకు రాకపోతే ఢిల్లీ షాన్ ఏం కావాలి? యెస్. నేను అచ్చంగా ఢిల్లీ గురించే మాట్లాడుతున్నాను. చిక్కటి చారిత్రక సంపద కొలువై, దేశానికి రాజధానిగా వెలుగొందే ఢిల్లీని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. నాకూ బాల్యం నుంచి ప్రయాణాలు అంటే ఇష్టం. కొత్త కొత్త ప్రాంతాలను చూడటం, అక్కడి ప్రజలతో మమేకమై వారి సంస్కతీ సాంప్రదాయాలను పరిశీలించడం చాలా ఇష్టం. అయితే విదేశాలను ఇంకా పర్యటించలేదు. కానీ, భిన్న సంస్కతుల సమాహారమైన మన భారత్ లోని వివిధ ప్రాంతాలను చుట్టి, అక్కడి విశేషాలు తెలుసుకోవడానికే మరెంతో సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే భారత్ భిన్న జాతుల, భిన్న మతాల, భిన్న సంప్రదాయాల మేళవింపు. అందుకే అన్నారు పెద్దలు ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని. వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నప్పుడు ఆ మాట పదే పదే రుజువవుతూనే ఉంది. దేశానికి మకుటాయమానమైన ఢిల్లీలో నా పర్య టన గురించి మీతో పంచుకుంటున్నాను.
మా ఢిల్లీ ప్రయాణం డిసెంబర్ మాసపు చలి రాత్రిలో ప్రారంభమైంది. విమాన యాన సమయానికి మూడు గంటలు బయలుదేరాల్సి ఉండడంతో ఆ రాత్రి నిద్ర కరువైంది. తెల్లవారుజామున 5.30 గంటలకు ఫ్లైట్. దానికోసం అర్ధరాత్రి దాటాక 2 నుంచి 2.30గంటల మధ్య మేము నివసించే ముషీరాబాద్ నుంచి శంషాబాద్ కు బయలుదేరాలి. ఆ సమయంలో మూడు క్యాబ్స్ కాన్సిల్ అయ్యాక నాలుగో క్యాబ్ పికప్ చేసుకుంది. అలా రాత్రి సమయంలో హైదరాబాద్లోని విశాలమైన రోడ్ల మీద, నిర్మల వాతావరణంలో ప్రయాణించడం ఓ మధురానుభూతి. చలికాలం కాకపోతే కార్ విండోస్ తెరిచి ఆ గాలులను ఆస్వాదించే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోను. ఉదయం ప్రాంతంలో విమానాశ్రయానికి చేరుకున్నాం. వివిధ దేశాలకు వెళ్ళే యాత్రికులతో అక్కడ అంతా సందడిగా ఉంది. బహుశా విమానాశ్రయంలో రాత్రి అనే పదానికి తావే లేనట్టుగా అనిపించింది. రకరకాల చెకప్ ల తరువాత ఫ్లైట్ లో కూర్చున్నాం. సరిగ్గా సమయానికి మబ్బులు చీల్చుకుంటూ లోహవిహంగం గాల్లోకి ఎగిరింది. రెండు గంటల అనంతరం మేము మన రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో లాండ్ అయ్యాం. బయటకు వచ్చేసరికి 7.45 గంటలు. పొగమంచు దుప్పటిని కప్పుకొని ఉన్న ఢిల్లీ మహా నగరంలో అప్పటికింకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పది అడుగుల దూరాన ఉన్న మనుషులు కానరానంత దట్టంగా పొగమంచు కమ్మేసింది. అంతకు ముందే హోటల్ బుక్ చేసి ఉండటంతో హోటల్ నుంచే నేరుగా వెహికల్ వచ్చేసింది. డ్రైవర్ రిసీవ్ చేసుకున్నాడు. మరో గంటన్నర ప్రయాణం తరువాత పహార్ గంజ్ ప్రాంతంలోని హోటల్ కు చేరుకున్నాం. ఈ హోటల్ నుంచి రైల్వే స్టేషన్ కు ఆటోలో పావుగంటలో చేరుకోవచ్చు.
అయితే మన దేశ రాజధాని. రాజకీయాలకు నెలవు. అభివద్ధికి మోడల్‌గా ఉండాల్సిన ఢిల్లీ జస్ట్ హోటల్ వరకూ చేసిన ప్రయాణంలోనే నన్ను నిరాశపరిచింది. ఎక్కడ చూసినా దుమ్ము కొట్టుకుపోయిన చెట్లు, ఎక్కడపడితే అక్కడ తవ్వి వదిలేసిన రోడ్లు, మురికి పట్టిన ఇళ్ళ గోడలు… నేను ఊహించిన ఢిల్లీకి, చూస్తున్న ఢిల్లీకి పొంతనే లేదనిపించింది. దీనికి తోడు త్రీస్టార్ హోటల్ అంటూ గూగుల్ లో కనిపించిన హోటల్ కాస్తా హైదరాబాద్ లోని ఇరానీ కేఫ్ కు అయినా సరితూగట్లేదిమిటా అనే సందిగ్ధం కలవరపరిచింది. చివరకు ఆ ప్రాంతంలోని ఏ హోటల్ ను పరిశీలించినా అదే వాతావరణం. ఆ వాతావరణానికి, ఆ పరిసరాలను తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఏ సౌకర్యాలను దష్టిలో పెట్టుకొని ఈ హోటల్స్ కు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారో నాకు ఎంతమాత్రం అర్ధం కాలేదు. చివరకు మాకు కావలిసిన విధంగా మా సూచనల ప్రకారం సిద్ధం చేసేసరికి పదకొండు దాటింది. మానసికంగా అలవాటు పడటానికి ఎంతో సమయం పట్టింది. అప్పుడు స్నానాలకు ఉపక్రమించి, గదిలోకే నాష్తా తెప్పించుకుని తినేసాం. నిద్ర లేకపోవడంతో ఎంతో అలసటగా అనిపించింది. మధ్యాహ్నం మూడు గంటల దాకా నిద్రపోయి, ఆ తరువాత విహారం గురించి ఆలోచించాం. బయటకు వెళ్ళి టీ తాగాక పక్కనే టూర్స్ ఆండ్ ట్రావెల్స్ ఆఫీస్ కనిపిస్తే ఈ సాయంత్రం వేళ చూడటానికి ఉన్న ప్రాంతాల గురించి ఆరా తీసాం. ఏ మాన్యుమెంట్ గురించి అడిగినా ఉదయం వేళలోనే బయలుదేరాలని చెప్పారు. ఇక దగ్గరలో ఏదైనా షాపింగ్ ప్రాంతం ఉందేమోనని అడిగితే కనాట్ ప్లేస్ గురించి చెప్పారు. అదే చూసి వచ్చేద్దామని మర్నాడు మరో ప్రాంతానికి వెళ్ళొచ్చు అనుకుంటూ బయలుదేరాం.
అతి పెద్ద షాపింగ్ సెంటర్ కనాట్ ప్లేస్ : దేశ హదయం ఢిల్లీ అయితే ఢిల్లీ హదయం కనాట్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ ను స్థానికులు షార్ట్ ఫామ్ లో సీపీ అని పిలుస్తుంటారు. అని ఇంగ్లీషులో అంటుంటారు. ఇది ఢిల్లీలోని అతిపెద్ద షాపింగ్ ప్రాంతం. 1911లో దేశ రాజధాని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు, బ్రిటిషర్స్ తమ అవసరాల కోసం నిర్మించుకున్న ప్రాంతం. 1929న ప్రారంభమైన నిర్మాణం 1933లో పూర్తైంది. దేశంలోని ప్రధాన ఆర్థిక, వాణిజ్య వ్యాపార సంస్థల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 2018 జులై నాటికి ప్రపంచంలోనే తొమ్మిదవ ఖరీదైన కార్యాలయాల ప్రదేశంగా గుర్తింపు పొందింది ఈ ప్రాంతం.
కనాట్ ప్లేస్ రెండు భవంతులుగా రెండు కిలోమీటర్ల మేరా విస్తరించి ఉంది. ఇందులో బ్లాకులుగా విభజితమై ఉంటాయి. ఈ బ్లాకులపై అవగాహన లేనివారు తప్పిపోవడం ఖాయం. ఇద్దరు యువకులు పాలికా బజార్ మధ్యలో నిల్చుని అద్భుతంగా గిటార్ ప్లే చేస్తూ పాట పాడారు. చాలాసేపు ఆ సంగీతాన్ని ఎంజారు చేస్తూ అక్కడే నిల్చున్నాను. పాట పూర్తయ్యాక నన్ను నేను పరిచయం చేసుకుని వారి పాటకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. డబ్బు ఇస్తే తీసుకుంటారా? అనే సందేహం వచ్చింది. మొహమాటంతో అడగకుండానే మెట్లదాకా వచ్చేసాను. మనసొప్పక తిరిగి వెనక్కు వెళ్లి డబ్బు తీసుకుంటారా అని అడిగితే కాలేజీ ఫీజుల కోసం ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. నా మొహమాటంతో అద్భుతమైన ఇద్దరు భావి పౌరులకు సాయం చేసే సదవకాశాన్ని పోగొట్టుకుని పశ్చాత్తాప పడుదును కదా అనిపించింది. వెంటనే కొంత అమౌంట్ వారి చేతుల్లో పెట్టి సంతప్తిగా వెనుదిరిగాను. మాకు షాపింగ్ చేసే ఆసక్తి లేకపోవడంతో దగ్గరలో మరేదైనా చూడదగిన ప్రాంతం ఉందేమోనని ఆలోచిస్తూ జామా మసీదును బ్రౌజ్ చేసాం. మూడున్నర కిలోమీటర్లుగా చూపింది. అదే ప్రాంతంలో మరో పురాతనమైన బజార్ చాందినీ చౌక్ కనిపించింది. నేరుగా అక్కడికే తీసుకెళ్ళమంటూ టాక్సీలో కూర్చున్నాం.
జామా మసీదు సందర్శన : వేలాది వాహనాల ట్రాఫిక్ ను దాటుకుని అరగంట ప్రయాణం తరువాత జామా మసీదు వాకిట అడుగిడినం. మసీదు వాకిలి అంటే చాందినీ చౌక్ అన్నమాట. భారత్ లోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా వెలుగొందుతోంది జామా మసీదు. 1650 నుంచి 1656ల ప్రాంతంలో షాజహాన్ నిర్మించారు. 5వేల మంది శ్రామికులు పనిచేసారట. ఆ కాలంలో ఈ నిర్మాణం ఖర్చు రూ.10లక్షలట. మస్జిద్ ఎ జహా నుమా అసలు పేరు. వ్యావహారికంలో జామా మసీదుగా పిలువబడుతుంది. చాందినీ చౌక్ లో ఇరువైపులా తినుబండారాలు, హోటళ్ళు, లస్సీ షాపులు… కిక్కిరిసిన జనసందోహాన్ని దాటుకుని మసీదుమెట్ల వరకు చేరడం సాహసంగానే తోచింది. మసీదు లోపలికి సందర్శకులు ఎక్కేవారు, దిగేవారితో రద్దీగానే ఉంది. అయితే మెట్లు, మసీదు ద్వారం… అన్నీ విశాలంగా ఉండటంతో అంతగా తోపులాట అనిపించలేదు. మెట్ల వద్దే పాదరక్షలు కాపాడే వ్యక్తులు కనిపించారు. అక్కడే మా పాదరక్షలు విడిచి ద్వారం వైపుకు నడిచాం.
ఒకేసారి పాతికవేల మంది నమాజు చేసుకునే విశాలమైన ప్రాంతమది. ఎర్రటి ఇసుక రాయితో చదును చేసిన నేల. చదరపు ఆకారంలో ఉండి మూడు ద్వారాలకు మధ్యన పశ్చిమ దిశలో ఠీవిగా నిలబడి ఉంది ఈ మసీదు. ఎర్రని రాళ్ళలో పాలరాతిని కలిపి నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. ఫతేపూర్ సిక్రీలోని జామా మసీదు నిర్మాణాన్ని అనుసరించి దీనిని నిర్మించారు. మసీదుకు ఉత్తర భాగంలో పాలరాతితో నిర్మించిన సుందరకట్టడం ఒకటి కొలువుదీరి ఉంది. అందులో మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు. జింకచర్మంపై లిఖించిన ఖురాన్ ఇదే మసీదులో ఉందని తెలిసింది. మసీదుకు ఇరువైపులా నలభై మీటర్ల ఎత్తైన మినార్లు ఉన్నాయి. మినార్ లోపల మెట్లు కూడా ఉన్నాయి. సుమారు 130 మెట్లు ఎక్కి చివరి అంచుకు చేరితే ఢిల్లీ నగరాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అయితే అందుకు టికెట్టు ధర చెల్లించాల్సి ఉంటుంది. నాకు చార్మినార్ ఎక్కినప్పుడు కలిగిన అనుభూతే ఇక్కడ కలిగింది. ఈ రెండు మినార్ల మధ్యలో రాజసం ఒలకబోస్తూ పాలరాయితో నిర్మించిన పెద్ద గుమ్మటం ఉంది. అణువణువును ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ మసీదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం.
ఆ దీప కాంతులలో మెరిసిపోతున్న జామా మసీదు సౌందర్యాన్ని మనసులో నిలుపుకుని బయటకు వచ్చేసాం. మసీదు తూర్పు భాగంలోని గుమ్మటం నుంచి ఎర్రకోట కనువిందు చేసింది.
ఆకట్టుకున్న ఆగ్రా అందాలు : పహార్ గంజ్ లో మేము దిగిన హోటల్ కు దగ్గరలోనే రైల్వేస్టేషన్ ఉంది అన్నాను కదా. అదే రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రాకు వెళ్ళాలి. ఈ ట్రైన్ మిస్ అయితే ఇక టాక్సీ తీసుకోవాల్సిందే. బస్సులు కూడా వెళ్తుంటాయి. కానీ అవి ఆగ్రా చేరుకునే సరికి ఏ మధ్యాహ్నమో అయిపోతుంది. చూసేందుకు సమయం చాలదు. అందుకని పర్యాటకులు ఎక్కువగా సొంత కారు కానీ, లేకపోతే హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో కానీ వెళ్తుంటారు. ఈ ట్రైన్ కు వారం రోజులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేయించాం. అందుకే రెండో రోజే మా ప్రయాణం ఆగ్రా అయింది. 6.30 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. అందుకని ఉదయం నాలుగు గంటలకే కాలకత్యాలు, స్నానపానాదులు ముగించుకుని సిద్ధమైపోయాం. అయినప్పటికీ కదిలే ట్రైన్‌ను పరుగెత్తుతూ దొరికిన బోగీలోకెల్లా ఎక్కేసాం. ఈ ట్రైన్ కు బోగీలూ ఎక్కువే ఉన్నాయి. మా రిజర్వ్డ్ సీట్లకోసం రద్దీగా ఉన్న జనాలలోంచి తోసుకుంటూ, తప్పించుకుంటూ 40నిమిషాలపాటు నడిచాకనే మా బోగీ వచ్చింది. ఏసీ బోగీ కావడంతో హాయిగా అనిపించింది. ఢిల్లీ నగర పరిసరాలు దాటుకుంటూ, హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశించి, ఆ తరువాత యూపీలోకి దౌడు తీసింది రైలు. పంట పొలాల అందాలు ఆస్వాదిస్తూ, మధ్య మధ్యలో పట్నం వాసనే లేని పల్లెటూర్లను గమనిస్తూ నాలుగు గంటల పాటు ప్రయాణించి ది గ్రేట్ ఆగ్రా స్టేషన్ లో అడుగు మోపాం.
ప్రతీ అనుభూతి వ్యాపారంలోకి బదిలీ అయ్యాక ఎక్కడా కాస్సేపు ప్రశాంతంగా కూర్చునే వ్యవధినివ్వని దళారులు పెరిగిపోయారు. మేం ట్రైన్ నుంచి దిగామో లేదో పరిసరాలనైనా గమనించనీయకుండా వెహికల్ డ్రైవర్స్ చుట్టుముట్టేసారు. పదుల సంఖ్యలో ఉన్న వాళ్ళను తప్పించుకుని ముందు ఏం చేయాలో ఆలోచించుకోవడం ఎంతో కష్టమైపోయింది. చివరకు ఒక దళారీకే చిక్కాం మేం. అతడు స్టేషన్ బయటకు నడిపించాడు. అతడికి తెలిసిన టాక్సీ అతడితో మాట్లాడించి మమ్మల్ని ఎక్కించాడు. ముందుగా టిఫిన్ చేసేందుకు ఏదైనా సౌతిండియన్ రెస్ట్రాంట్ కు తీసుకెళ్ళమని చెప్పాం. తమిళుల హోటల్ కు తీసుకువెళ్ళాడు. అక్కడ వాష్ రూమ్స్ ఏమైనా వాడుకోవచ్చేమోనని చెక్ చేస్తే అస్సలు బాగోలేవు. ఇక ఇడ్లీ తెప్పించుకుని తిని బయటపడ్డాం. తెలుగు హోటల్ కదా, తమిళ హోటల్ కదా… మన రుచులు లభిస్తాయేమోననే ఆశ మటుకు పెట్టుకోకూడదనిపించింది. ఎందుకంటే మన టేస్ట్స్ వాళ్ళు చేయలేరంతే. ఇక ఆగ్రా కోట ముందు చూడాలా? తాజ్ మహల్ ముందు చూడాలా అనే చర్చ కాసేపు. అప్పటికే 11.45 అయింది. ఎండ విపరీతంగా ఉంది. చివరకు డ్రైవర్ సూచననే అనుసరించాం. ”ఎండ తగ్గితే తాజ్ మహల్ వద్ద బాగుంటుంది. ఈలోపు కోట చూసేయండి” అన్నాడతను. మేము సరే అన్నాం. ఈలోపు మాకు చల్లటి లెమన్ సోడా కనిపించింది. రోడ్డు పక్కగా కారు ఆపి చల్లటి లెమన్ సోడాతో దాహార్తిని తీర్చుకుని ఆగ్రా కోటకు చేరుకున్నాం.
ఆగ్రా కోట : ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో యునెస్కో వారి గుర్తింపు పొందిన కట్టడం ఇది. అసలు మొఘల్ సామ్రాజ్యంలో నిర్మితమైన ఏ కట్టడమైనా వర్ణించిన దానికంటే చూసి తీరడమే గొప్ప అనుభూతి. ఆగ్రాకోటను బయటి నుంచి చూస్తుంటేనే నమ్మశక్యం కానంత హుందాగా, దర్జాగా కనిపించింది. ఎర్రటి రాతి కట్టడం. దీనిని కూడా లాల్ ఖిలా అంటే ఎర్ర కోట అనే పిలుస్తారట. దీనికి మరో పేరే ఆగ్రా కోట. Red Fort. ఈ కోట నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతికతకు అబ్బురపడిపోయాను. ఆ రోజులలో అరాకొరా సదుపాయాలతో ఇంతటి పరిజ్ఞానాన్ని ఎలా సాధించి ఉంటారో. అది కూడా అయిదు వందల ఏళ్ళ క్రితం. శత్రు దుర్భేద్యమైన ఈ కోట గురించి ఎంత చెప్పినా తక్కువే. సాంకేతికతను మాత్రమే ఇందులో చూడొచ్చా అనుకుంటే… మరోవైపు అడుగడుగునా కళాత్మకత ఉట్టిపడి కన్ను చెదురుతుంది.
ఈ కోట విస్తీర్ణం 94 ఎకరాలు. అక్బర్ చక్రవర్తి నివాసం ఇందులోనే. పరిపాలన కూడా ఇదే కోట నుంచి సాగించాడు. కోట ప్రవేశ ద్వారం వద్దకు చేరుకునే వ్యాసార్ధంలో మూడు కక్ష్యలతో కూడిన లోతైన కందకాలు ఉంటాయి. ఈ కందకాలు కోట చుట్టూ ఉండి ప్రవేశ ద్వారం వద్దనే అంతమౌతాయి. ఎవరైనా కోటలోకి ప్రవేశించాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఈ ద్వారం నుంచే కొనసాగాలి. చుట్టూ ఉన్న కోట ప్రహరీ గోడ నుంచి ఎవరైనా లోపలికి ప్రవేశించడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే మొదటి కక్ష్య కందకంలో నిండా నీళ్ళు ఉండి అందులో భయంకరమైన మొసళ్ళు ఉండేవట. శత్రువు ఆ కక్ష్యను దాటడం అసాధ్యం. ఒకవేళ దాటినా రెండో కక్ష్య నుంచి బయటపడటం మరో అసాధారణ విషయం. అందులో కౄర మగాలు ఉండేవట. ఇక అది కూడా దాటి లోపలికి రాబోతే మూడో కక్ష్యలో ఉన్న సైనికులు శత్రువును తునాతునకలు చేయడమే.
ఇక ప్రధాన ద్వారం నుంచి ప్రవేశ ద్వారం ద్వారా కోటలోకి వెళ్ళే ముందు ఆ ద్వారం అందచందాల గురించి ఒక్క ముక్కైనా చెప్పకపోతే తప్తిగా ఉండదు. ప్రవేశ ద్వారం కూడా ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన తరువాత రాజ మహల్ కు చేరడానికి ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గం నిర్మాణం కూడా ఆనాటి మేధావుల గురించి ఆలోచించేలా చేస్తుంది. ఈ దారి గుండా గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ప్రవేశించినప్పుడు వాటి అడుగుల శబ్దాన్ని బట్టి ఎవరో వస్తున్నారని గమనించడానికి ఆస్కారం ఉండేదట. దారి చూడటానికి సమాంతరంగానే ఉంటుంది. దారికి ఇరువైపులా ఉండే గోడలు సమానమైన ఎత్తు, సమానమైన పొడవులోనే ఉంటాయి. అయితే ఇందులో ఉపయోగించిన పరిజ్ఞానం వల్ల గుర్రం కాలి గిట్టెల శబ్దం ప్రతి ధ్వనించి రాజమహల్ లోకి వినిపిస్తుంది. తొలుత ఎత్తుగా కనిపించే గోడలు రాజ మహల్‌కు దగ్గవుతున్నా కొద్దీ గోడల ఎత్తు తక్కువగా కనిపించి వీరి తలలు బయటకు కనిపిస్తాయట. విదేశీ శాస్త్ర సాంకేతిక నిపుణుడు దీనిని రూపొందించినట్లు అక్కడి స్థానిక గైడ్ వివరించాడు. ఈ గోడల్లో మరో విశేషముందండోరు. శత్రువు ప్రధాన ద్వారం గుండా, ప్రవేశ ద్వారం ద్వారా సైనికుల కన్నుగప్పి లోపలికి ప్రవేశించినా, వచ్చేది శత్రువు అని రుజువైతే చాలు అక్కడికక్కడే మట్టుపెట్టడానికి ఈ దారి ఉపకరిస్తుందన్నమాట. వచ్చేది ఎవరో కనుక్కునే చప్పుడు గురించి చెప్పాను కదా. అలా శత్రువును పసిగట్టాక ఇరువైపులా ఉండే గోడలకు ప్రత్యేకమైన గవాక్షాలు ఉన్నాయి. ఆ గవాక్షాల ద్వారా వేడి వేడి నూనెను, వేడి నీళ్ళను జార విడుస్తారట. బ్రిటిషర్లు దాడి చేసినా చెక్కు చెదరని ఈ నిర్మాణం ఇంకా ఆనాటి సాంకేతికతకు సాక్షిగానే ఉంది.
అక్కడి నుంచి రాజ మహల్ వైపుకు వెళ్తుండగా ఓ అద్భుతమైన రాతి తొట్టి కనిపించింది. దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అది అక్బర్, జోధాబాయిల ముద్దుల తనయుడు సలీం స్నానించిన తొట్టి.
జహంగీర్ స్నానపు తొట్టి: ఆగండాగండి. సలీం స్నానించిన తొట్టి అని చెప్పి ఇక్కడ జహంగీర్ అని అన్నానేమిటా అనుకుంటున్నారా? చెప్తాను. సలీమే జహంగీర్. సలీంను బాల్యంలో జహంగీర్ అనే పిలిచేవారట. ఈ తొట్టి ప్రత్యేకత ఏమిటంటే సలీం పుట్టినప్పుడు అతడి మేనమామ దీనిని బహుమానంగా ఇచ్చాడట. ఏకశిలా నిర్మాణం. ఎనిమిది అడుగుల వెడల్పు, అయిదు అడుగుల లోతు ఉన్నప్పటికీ ఒకే రాయిలో దీనిని చెక్కించారు. బాలుడు స్వతహాగా తొట్టి లోపలికి దిగి, ఎక్కేందుకు లోపలా, బయటా మెట్లు కూడా పెట్టించడం విశేషం. సగం తొట్టిని భూమిలో పాతి పెట్టి ఉంచేవారట. ఇంకా ఈ తొట్టి అంచులకు బంగారు నగిషీలు చెక్కి ఉండటం విశేషం. అయితే బ్రిటిషర్ల దాడిలో బంగారు నగిషీలు మాయమై తొట్టి మటుకు మిగిలింది. ఈ తొట్టి ధ్వంసమైన అక్బర్ మహలులో తవ్వకాలలో బయటపడింది. ఇప్పుడు ప్రదర్శనకు ఉంచారు. అక్కడ జహంగీర్ స్నానపు తొట్టి అనే బోర్డు మనకు కనిపిస్తుంది. ఈ తొట్టి వద్ద ఉడతలతో వ్యాపారం చేసే వారు కనిపిస్తుంటారు. వారు ఉడుతలను చేతిలోకి తీసుకుంటారా అని అడుగుతారు. మనం సంతోషంగా సరే అంటాం. అప్పుడు అతడు చిటికెడు బిస్కట్ పొడిని మన చేతిలో వేస్తాడు. అంతే ఆ ఆహారాన్ని చూసి ఉడుత మన చేతిలోకి పరుగెత్తుకుంది. క్షణంలో స్వాహా చేస్తుంది. రెప్పపాటులో జరిగే ఈ తతంగానికి రూ.20/- వసూలు చేస్తాడు. కనీసం అది మన చేతిలో నిలిచిన అనుభూతైనా పొందలేదే అని బాధపడి మళ్ళీ ఇరవై ఇచ్చి చేతిలోకి పిలిచారనుకోండీ. మళ్ళీ అదే తంతు. మేం ఒక ఫొటో అయినా తీసుకుందామని బాగానే వదిలించుకొన్నామనుకోండి. కానీ, బాల్యం నుంచి మనుషులు కనిపిస్తేనే పారిపోయే ఉడుతను జీవితంలో ఎప్పుడూ తాకనైనా లేదు. దానిని చేతిలోకి తీసుకోవడం అదే మొదటిసారి. ఆ అనుభూతి అపురూపం అనిపించింది.
ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే జోధాబాయి నివసించిన మందిరం వస్తుంది.
జోధాబాయి మందిరం: జోధాబాయి నివాస మందిరాన్ని జహంగీరి మహల్ అని కూడా పిలిచేవారు. జోధాబాయి రాజస్థానీ కావడంతో మందిరం నిర్మాణం కూడా రాజస్థాన్ లోని నిర్మాణాలను అనుసరించారు. జోధాబాయి మందిరంలో అతిథుల కోసం ప్రత్యేక గదులు, ఆమె పడక గదితోపాటు, పూజా మందిరం, లైబ్రరీ, వంటశాల, భోజనశాల తదితర విభాగాలు ఉన్నాయి. పడక గదిలో ఏసీతో ఎటువంటి చల్లదనం వస్తుందో, ఆ చల్లదనాన్ని సాంకేతికతను ఉపయోగించి రప్పించారు. ఇప్పటికీ ఆ గదులు చెక్కుచెదరలేదు. ఆ గదులకు పైన నీటి తొట్టెలు అమర్చి, బోలు గోడల్లోకి నీరు ప్రవహించేలా చేయడంతో గది ఎల్లప్పుడూ చల్లగా ఉండేదట. దీని గురించి విన్న తరువాత ఔరా! మన పూర్వీకులు… అనిపించింది. అటునుంచి నేరుగా షాజహాన్ సౌధంలోకి ప్రవేశించాం.
షాజహాన్ మహల్: జహంగీర్ (సలీం) కుమారుడైన షాజహాన్ సింహాసనాన్ని అందించిన తరువాత మరికొన్ని నిర్మాణాలు చేపట్టాడు. ఆగ్రాకోటలో తన నివాస మందిరానికి ఇరువైపులా తన ఇద్దరు కుమార్తెలైన జాహాఉఆరా, రోషన్ ఆరా కోసం రెండు నివాస మందిరాలు నిర్మించాడు. ఇవి పల్లకి ఆకారంలో నిర్మించబడి, వాటి కప్పు బంగారు తొడుగులతో ఉండేదట. బ్రిటీషర్ల దాడిలో అంత బంగారాన్ని, వజ్ర, వైఢూర్యాలను ఎత్తుకువెళ్ళారట. ఆ నమూనా సందర్శకులకు అర్ధమయ్యేలా ప్రభుత్వం ఇత్తడి తొడుగులతో అలంకరించింది. షాజహాన్ కేవలం ముంతాజ్ పై మాత్రమే తన ప్రేమను చాటుకోలేదు. అందరికోసం ఇటువంటి కట్టడాలు నిర్మించాడని ఈ జాహాఉఆరా, రోషన్ ఆరా మందిరాలు చూసాకే అర్ధమైంది.
ఇక ఈ రెండు మందిరాల మధ్య షాజహాన్ మహల్ కొలువై ఉంది. ఈ కట్టడంలో అనేక విశేషాలు ఉన్నాయి. ఈ మందిర నిర్మాణంలో ఉన్న కళాకతులకు తగినట్టుగా బంగారాన్ని పోతపోసి అతికించారట. ఇక మధ్యమధ్యలో స్వచ్ఛమైన నవరత్నాలను పొదిగి అలంకరించారట. సూర్యకాంతి ఎప్పుడైతే ఈ మహలులో పడుతుందో ఆ సమయంలో ఆ మందిరమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుందట. ఈ పాలరాతి కట్టడాన్ని కూడా తెల్లదొరలు ధ్వంసం చేసి వజ్రవైఢూర్యాలను తమ దేశాలకు తరలించుకున్నారు. పోత పోసిన బంగారాన్ని కరిగించేందుకు మందిరాన్ని నిప్పులకొలిమి చేసారట. అందుకు నిదర్శనంగా ఆ తెల్లటి పాలరాయి మసిబారిన ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడక్కడా డిజైన్లలో చిక్కుకున్న బంగారం, నవరత్నాలు మౌనసాక్షులుగా ఇంకా నిలిచే ఉన్నాయి. సందర్శకులు ఆ మిగిలిన వాటిని తవ్వి తీసుకెళ్తుండడంతో ఇప్పుడు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ మందిరంలో మరో విశేషం ఏమిటంటే షాజహాన్ తాను ఉన్న చోటు నుంచే తాజ్ మహల్ ను చూసేలా నిర్మింపచేసాడు. తన కుమారుడు ఔరంగజేబు రాజ్యాన్ని చేపట్టాక షాజహాన్ ను ఇదే గహంలో నిర్బంధించినప్పుడు ఇక్కడి నుంచే తాజ్ మహల్ ను వీక్షిస్తూ తప్తి పడేవాడట. అయితే మరింత స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా అతడి కుమార్తె జాహాఉఆరా కోహినూర్ ను బహూకరించిందట.
ఇక షాజహాన్ మహల్ కు ఎదురుగా ఓ అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ ఉంది. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో నీరు విరజిమ్మేలా చేయడం ఓ విశేషం. ఎక్కడో ఎత్తైన నీటి తొట్టెలు నిర్మించి ఆ తొట్టెల ద్వారా నీటి ప్రవాహాన్ని వేగం చేసి, ఒత్తిడి పెంచడం ద్వారా ఈ ఫౌంటెన్ పని చేస్తుందట. ఇప్పటికీ వర్షంతో ఆ తొట్టెలు నిండితే ఈ ఫౌంటెన్ భేషుగ్గా పని చేస్తుండడం అద్భుతం. అతిథులు వచ్చినప్పుడు స్వచ్ఛమైన రోజ్ వాటర్ నింపేవారట. ఇక ఈ మందిరానికి మూడు వైపులా షాజహాన్ భార్యలు, వారి స్నానపు శాలలు ఉన్నాయి. ఇంకా షాజహాన్ సభను కొలువుదీర్చే ప్రత్యేక ప్రదేశం, పురుషులు నమాజ్ చదివేందుకు మీనా మసీదు, మహిళల కోసం నాగిన్ మసీదులు కొలువు దీరి ఉన్నాయి.
ఇక మీనా మసీదు పక్కగా మెట్లద్వారా కిందికి వెళ్తే లోపలివైపు దాసదాసీ జనం గహాలు, మధ్యలో మూడు ద్రాక్ష తోటలు కొలువుదీరి ఉన్నాయి. ఇప్పుడు ఆ తోటలు అందమైన పూదోటలుగా మారాయి.
ఇక ఆ కట్టడాన్ని ఆనుకుని ముందువైపుకు వస్తే అక్బర్ చక్రవర్తిగా తీర్పులు చెప్పే సింహాసనం ఉండే మహల్ వస్తుంది. నేను జోధా అక్బర్ సినిమా చూసి ఉండడంతో అక్బర్ సింహాసనాన్ని, అతడి పరివారాన్ని ఊహించుకుంటూ చూడటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఈ సభలోనే కదా తాన్ సేన్ కొత్త కొత్త రాగాలు ఆలాపించిందీ. ఈ సభలోనే కదా అక్బర్ పై గమ్మత్తైన చెణుకులు విసిరిన బీర్బల్ నడయాడినదీ. మరెన్నో అనుభూతులు మిళితమై ఆనాటి రాచరిక వ్యవస్థ కళ్ళముందు నిలిచింది. అక్బర్ స్థానంలో హ్రితిక్ రోషన్ హుందాగా నడిచి వస్తున్న భావన. కులమతాలకు అతీతమైన దర్బారులో ప్రజలు తమ కష్టాలను రాజులకు విన్నవించుకుంటున్న దశ్యాలు. ఓV్‌ా… ఒకటేమిటి…. ఈ మహల్ నుంచి బయటకు రావడం ఎంతో కష్టమైపోయింది. ఇంటికి చేరుకున్నాక ఆ సినిమాను, రియాలిటీ ని పట్టి పట్టి చూసాను. నిజానికి సినిమాలో కొలువుదీరిన దర్బారును ఇక్కడే షూట్ చేసారట.
ఆగ్రాకోటలో ప్రస్తుతం ఇంత వరకే ప్రదర్శనకు ఉంచారు. మిగతా కొంత భాగాన్ని ప్రభుత్వ ఆర్మీ వారు ఉపయోగించుకుంటున్నట్లు గైడ్ వివరించాడు.
నోట్: ఆగ్రాకోటను సందర్శించాలంటే కచ్చితంగా గైడ్ ను తోడు తీసుకోవలిసిందే. లేకపోతే అవన్నీ చూడలేం. ఆ విశేషాలు తెలుసుకోలేం.
మరో ముఖ్య గమనిక ఏమిటంటే చారిత్రక ఆసక్తి ఉన్నవారు గైడ్ తనకున్న సమయంలో చెప్పి వెళ్ళాక మనమే నింపాదిగా వాటన్నింటినీ చూడాలంటే కనీసం ఒక రోజును కేటాయించుకోవాలి. అప్పుడే మరిన్ని అనుభూతులను మదిలో నిక్షిప్తం చేసుకోగలం. ఈ మరుపురాని అనుభూతులను నెమరు వేసుకుంటూ చలో తాజ్ మహల్ అని బయలుదేరాం.
ధవళ కాంతుల సుందర స్వప్నం: ‘‘ఆకాశం నుంచి ఊడి పడిన మబ్బు తునక నేలపై ఈ రూపం ధరించిందేమో!” తాజ్ మహల్ కు దగ్గవుతున్నాకొద్దీ ఈ భావం మరింతగా బలపడసాగింది. ఎన్నెన్ని గొప్ప పాదాలు తాకిన నేల ఇది. ఎన్ని కోట్లమంది ప్రేమికులకు నెలవైన సుందరతావు ఇది? మదిలో ప్రకాశించే ఏ భావానికైనా నా ఈ అక్షరాలు ప్రతిబింబాలవుతాయా? ఊహూ..! చూసి తరించాల్సిందే. చందమామను అద్దంలో చూపించడమెందుకు? అందరికీ తెలిసినదే గనుక దీని గురించి మరింత ఏమీ రాయను. కానీ సందర్శకులకు అవసరమయ్యే చిన్న సూచనలు.
తాజ్ మహల్ కు వెళ్ళే దారిలో బోలెడన్ని కోతులు ఉంటాయి. అవి మనుషులకు ఎంత అలవాటు పడ్డాయంటే ఎవరి చేతిలోనైనా తినే వస్తువులు కనిపించాయంటే రెప్పపాటులో కాజేస్తాయి. లోపలికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. నడిచే ఓపిక లేకపోతే ఈ ఆటోస్ ఎక్కి వెళ్ళవచ్చు. ఆ తరువాత అయినా కాస్తంత దూరం నడిచి తీరాల్సిందే. ఇందుకు మానసికంగా సంసిద్ధమై వెళ్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఇక లోపలకు వెళ్ళాక టారు లెట్ కోసం ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందుగానే టీ షాప్స్ పక్కనున్న హోటల్లోకి వెళ్ళవచ్చు.
మేము మధ్యాహ్నం 3.30 గంటలకు తాజ్‌మహల్ కు వెళ్ళాం. సాయంత్రం 5.30గంటలకు బయటకు వచ్చాం. మండుటెండలో ఆ పాలరాతి కట్టడపు మెరుపులు చూసాం. నీడలో ఠీవిగా ప్రశాంతతను వెదజల్లే శాంతి సౌధాన్ని చూసాం. యమునా తీరాన ఒదిగిన ఆ ప్రేమ చిహ్నాన్ని గుండెల నిండా నింపుకొని భార హదయాలతో వెనుదిరిగాం.
ఆగ్రాకు వెళ్లి పేటా మిఠాయిని మరువగలమా? అందుకే ఓ షాపులో ఎనిమిది కేజీల స్వీట్ ను రకరకాల ఫ్లేవర్స్ లో తీసుకుని ఢిల్లీకి బస్సులో పయనమయ్యాం.
బస్సు దారి మధ్యలో ఏదో ఊరిలో ఓ ధాబా ముందు భోజనానికి ఆపారు. అక్కడ రుచికరమైన పంజాబీ ఫుడ్ దొరికింది. రైస్ మటుకు తినలేకపోయాం. బాయిల్డ్ రైస్ వాడతారట. భోజనం తర్వాత అద్భుతమైన లస్సీ తాగి మళ్ళీ బస్సు ఎక్కేసాం. అర్ధరాత్రి 12.30 గంటలకు ఢిల్లీ బస్టాండ్‌కు, అక్కడి నుంచి ఆటోలో హోటల్‌కు చేరుకున్నాం.
మూడోరోజు ఉదయం మా ప్రయాణం న్యూఢిల్లీ వైపు సాగింది. లాల్ ఖిలా, కుతుబ్ మినార్, ముఘల్ గార్డెన్, జంతర్ మంతర్, పార్లమెంట్ తదితర ప్రాంతాలు సందర్శించేలా ప్యాకేజ్ మాట్లాడుకుని టూర్స్ ఆండ్ ట్రావెల్స్ కారు ఎక్కేసాం. ముందుగా లాల్ ఖిలాను సందర్శించాం.
మన జెండా రెపరెపల లాల్ ఖిలా: ఆగ్రా కోట ఎంత పటిష్టంగా నిర్మించారో ఢిల్లీలో లాల్ ఖిలా అంతే బందోబస్తుగా నిర్మితమైంది. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న మన దేశ ప్రధానమంత్రి ఇక్కడే మన జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాల విశిష్ట ప్రదర్శన ఇక్కడే జరుగుతుంది. అందుకోసం విశాలమైన మైదానం ఉంది అక్కడ. లాల్ ఖిలాను మనం ఎర్రకోటగా పిలుస్తున్నాం. ఆంగ్లం లోRed Fort అన్నమాట. ఎర్రకోట కూడా విశాలమైన ప్రాంగణాన్ని కలిగి అత్యంత పటిష్టమైన ప్రహరీని కలిగి ఉంది. ఈ కోటను షాజహాన్ నిర్మించాడు. పరిపాలనను ఆగ్రా కంటే అనుకూలమైన ప్రాంతం నుంచి సాగించాలనుకున్నప్పుడు ఢిల్లీలోని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారట. 120 ఎకరాల భూభాగంలో నిర్మితమైన కోటలో అనేక భవనాలు, చక్కటి ఉద్యానవనాలు ఉన్నాయి. షాజహాన్ ఎంతో ఇష్టంగా తయారు చేయించుకున్న నెమలి సింహాసనం ఇక్కడే ఉంది. స్వాతంత్య్ర పోరాటం గురించి వివరించే మ్యూజియం ఇక్కడే ఉంది. షాజహాన్, ఔరంగజేబు పరిపాలనలో ఏర్పాటు చేసిన గుర్రపు శాలలు, ఒంటెలు, ఏనుగులు… ఇలా మరెన్నో జంతువుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాలలు, వాటి స్నాన వాటికలు ఇలా ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడే ఆకలి మొదలవడంతో నేరుగా జంతర్ మంతర్ వైపుకు దారి తీసాం. డ్రైవర్ అక్కడే కాస్త మనదైన భోజనం దొరుకుతుందని చెప్పాడు.
జంతర్ మంతర్: స్వర్గంలోని సామరస్యాన్ని కొలిచే సాధనం అని దీనికి అర్ధమట. ఈ ప్రాంతంలోని కొన్ని కట్టడాల వల్ల దీనికి ఆ పేరు వచ్చినప్పటికీ రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ఎవరు నిరసన తెలిపినా ఇక్కడే తెలుపుతారు. ఒక విధంగా ధర్నా చౌక్ లాంటిది. బాల్యం నుంచి వార్తల్లో ఈ పేరు వింటూ ఉండటం వలన నాకు జంతర్ మంతర్ చూడాలనే కోరిక చాన్నాళ్ళుగా ఉంది. అది ఈ రూపంలో నెరవేరింది. ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన ఆహారం లభిస్తుందట. అందుకే ఆ ప్రాంతం చూడటంతో పాటు లంచ్ కూడా అయిపోయింది. అలాగే తింటున్న సమయంలో వరంగల్ కు చెందిన దళిత యువజన నేతలు అక్కడ పరిచయం అవడం సంతోషం కలిగించింది. వారు దళిత హక్కుల పోరాటానికై ఢిల్లీ చేరారట. అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పార్లమెంటు భవనం, ఆ ప్రాంగణానికి మరింత దగ్గరలో ఉన్న ఎంపీల గహాలు, బిఆర్‌ఎస్ కోసం నిర్మితమవుతున్న నూతన భవనం అన్నీ వరుసగా చూసుకుంటూ రాష్ట్రపతి భవనం చేరుకున్నాం. అక్కడ అందమైన ముఘల్ గార్డెన్ చూడాలని మా కోరిక. కానీ అదే సమయంలో సైనిక పటాలం దిగడంతో గార్డెన్ లోకి ప్రవేశం లభించలేదు. ఉసూరుమంటూ కుతుబ్ మినార్ వైపు వెళ్ళిపోయాం.
కుతుబ్ మినార్: ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల నిర్మాణం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో యునెస్కో వారు ఈ మినార్ ను కూడా గుర్తించారు. దీని ఎత్తు 72.5 మీటర్లు. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మినార్ కు ఇంజనీరింగ్ విశిష్టత ఉంది. అదేమిటంటే ఏటా జూన్ మాసంలో 22వ తేదీన ఈ మినార్ నీడ భూమిపై పడదు. ఇది భౌగోళిక శాస్త్ర రహస్యం అట. ఈ పొడవాటి కట్టడాన్ని చూస్తూ, అందులోని రహస్యానికి ఆశ్చర్యపడి పోయాం. ఉత్తర అక్షాంశం మీద అయిదు డిగ్రీల ఒంపుతో దీనిని నిర్మించడం వల్ల ఈ అద్భుతం సాధ్యైందట. ఇక్కడే గంటన్నరపాటు కూర్చుని సేదతీరాం. ఇక సాయం సంధ్య కావడంతో ఇండియా గేట్ వైపుకు దారి తీసాం.
ప్రైడ్ ఆఫ్ ఇండియా: యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ (India Gate) 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో, అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడం భరత్‌పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలలో చూడముచ్చటగా ఉన్న పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది. ఉదయం వేళలో మరోసారి చూడాలని అనుకున్నాం. ఇక్కడ సైనిక కవాతు ఎంతో అద్భుతంగా ఉంటుందని చాలాసార్లు విని ఉన్నాను. అయితే మరుసటిరోజు నిజాముద్దీన్ దర్గా వైపు వెళ్ళాల్సి ఉండడంతో చూడలేకపోయాం. అక్కడే 9 గంటలవరకూ గడిపి తట్టుకోలేని చలితో హోటల్ కు పయనమయ్యాం.
నిజాముద్దీన్ దర్గా: సూఫీలలో అత్యంత ప్రముఖ సూఫీ హజరత్ నిజాముద్దీన్ ఔలియా. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దర్గా. ఈ దర్గాకు చుట్టూతా పూవులు, ఆహారం, ధట్టీలతో కూడిన షాపులు నిండుకుని ఉన్నాయి. ఇరుకు దారుల గుండా దర్గాలోపలికి ప్రవేశించాం. లోపలకు అడుగుపెట్టిన తరువాత అంతా ఆధ్యాత్మిక వాతావరణమే. మొక్కులు తీర్చుకునే వారు, దర్గా సందర్శనార్థం వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది. హిందీ సినిమా రాక్ స్టార్ లో హీరో ఈ దర్గాలో కూర్చుని ‘కున్ ఫాయ కున్’ గీతాన్ని ఆలపిస్తాడు. అలా ఖవ్వాలీ జరిగే ప్రదేశాన్ని చూసేసరికి మనసు ఎంతో ఉద్వేగంతో కొట్టుకుంది. కాసేపు దువా చేసుకున్న అనంతరం బయటకు వచ్చేసాం. ఆ షాపుల వద్ద లభించే స్వీట్ ఎంతో ప్రసిద్ధి చెందినది. పూరీ హల్వా ఎందరో పర్యాటకులు ఇష్టంగా తింటుంటారు. అప్పటికే మాకు ఆకలిగా ఉండటంతో హైదరాబాదీ బిర్యానీ పేరుతో బోర్డు కనిపించడంతో కాస్త హుషారు వచ్చేసింది మా అందరిలోనూ. పంజాబీ ధాబాలో బాయిల్డ్ రైస్ తిన్న అనుమానంతో వెంటనే ఆర్డర్ చేయకుండా ఆచితూచి ఒక్క ప్లేట్ మటుకే ముందుగా తెప్పించుకున్నాం. అదీ బాయిల్డ్ రైస్ తో చేసిన బిర్యానీయే. దాంతో చికెన్ తందూరితో నాన్ రోటీ ఆర్డర్ చేసుకున్నాం. అది కాస్త హాయిగా తినేసి ఆ పక్కనే ఉన్న హుమాయూన్ టూంబ్స్ కు కాలి నడకన బయలు దేరాం.
హుమాయూన్ సమాధి: ముఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్ కొడుకు హుమాయున్. హుమాయూన్ తనయుడు అక్బర్. హుమాయూన్ చక్రవర్తి పండితుడు. అతడు చిన్న వయసులోనే మరణించడంతో అత్యంత పిన్న వయసులోనే (14ఏళ్ళు) అక్బర్ రాజ్యపాలనను చేపట్టవలసి వచ్చింది. ఆ సమయంలోనే అక్బర్ తల్లి, హుమాయూన్ భార్య హమీదా బేగం హుమాయూన్ సమాధిని నిర్మింపచేసింది. దీనికి కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో యునెస్కో గుర్తింపు లభించడం విశేషం. ఎనిమిది సంవత్సరాల పాటు నిర్మించారు. తాజ్ మహల్ కు పూర్వం ఈ కట్టడం దేశంలోనే అత్యంత సుందర కట్టడంగా పేరొందింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడానికి చుట్టూ ఎన్నో తోటలు ఉన్నాయి. ఈ కట్టడాన్ని ఎంత చూసినా తనివి తీరలేదు.
ఈ సుందర కట్టడాల షాన్ దార్ ఢిల్లీని చూసి రాత్రి 8గంటల ఫ్లైట్ కోసం విమానాశ్రయం చేరుకున్నాం. కుటుంబం అంతా కలిసి చేసిన ఈ పర్యటన ఎన్నెన్నో మధురానుభూతులను మిగిల్చింది. ఇంకా లోటస్ టెంపుల్, అక్షరధామ్, లోడీ గార్డెన్, బిర్లా మందిర్, సఫ్దర్ జంగ్ టూంబ్, రాజ్ ఘాట్ వంటి మరెన్నో నిర్మాణాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల మా పర్యటనను ముగించాల్సి వచ్చింది. ఎంతో ఆసక్తికరమైన టూర్. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీలను కలిపి పర్యటించాలంటే నా మటుకు వారం రోజులు కేటాయించాలనిపించింది. అప్పుడైతేనే చారిత్రక ప్రాధాన్యతను సమగ్రంగా గ్రహించవచ్చుననిపించింది. ఈ పర్యటన ఎంతో హాయిగా సాగిపోయినా పాతఢిల్లీలో అపరిశుభ్రమైన వాతావరణం ఉంది. అలాగే రాజధాని కావడంతో అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ కనిపిస్తారు. అందులో పేదవారు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపించారు. అక్కడ మనుషులను కూర్చోబెట్టుకుని కార్మికులు కాళ్ళతో తొక్కే రిక్షాలు ఇంకా కనిపిస్తున్నాయి. గుట్కాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. చాలా మంది టాక్సీ డ్రైవర్లు పరిశుభ్రమైన రోడ్లపై కూడా నిరభ్యంతరంగా ఉమ్మి వేస్తున్నారు. ఇక మనం ఏ ప్రదేశాన్ని చూడాలనుకున్నా కనీసం ఒకట్రెండు కిలో మీటర్లు నడవాల్సిందే అనే విషయాన్ని జీర్ణించుకుని మరీ రావాలి ఎవరైనా.
నచ్చినవి: కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ-ఆటోలను ప్రోత్సహిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఈ ఆటోలు కనిపించాయి. చడీచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. పాత ఢిల్లీకి పూర్తి విరుద్ధంగా ఎంతో అందంగా ఉంది న్యూఢిల్లీ. జీవిత వైరుధ్యాలు కచ్చితంగా ఇక్కడ చూడొచ్చు.
– నస్రీన్ ఖాన్
writernasreen@gmail.com