లాటిన్ అమెరికా విప్లవ
ఝంఝా మారుతాల నడుమ
వెలిగిన తిరుగుబాటు సూర్యుడివి !
చెరగని ధైర్యానికి చిరునామావై
భయపడటం మరణంకన్నా హీనమని
బానిసగా బ్రతకడం హేయమని
నిలబడి పోరాడుతూ మరణించడమే
యోధుని లక్షణమని
క్యూబా ప్రజా పోరుబాటలో
వేగుచుక్కై విప్లవ కెరటమై
ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థను
అమెరికా సామ్రాజ్యవాదాన్నెదిరించి
దుర్మార్గ బాటిస్టా పాలనను
అంతమొందించగ నీదైన
గెరిల్లా యుద్ధతంత్రంతో
మెరుపు దాడులు సాగిస్తూ
ఆత్మాహుతి దళాలతో
శాంటా క్లారా యుద్ధ గతిని మార్చి
విజయకేతనం రెపరెపలాడించి
ప్రపంచ తిరుగుబాటు యవనికపై
వెలిగిన అరుణ తారవు నీవు !
అర్జెంటీనాలో పుట్టి
వైద్యవృత్తిలో రాణించి
క్యూబా విముక్తి పోరాట
లాంగ్ మార్చ్ లో
క్యూబన్ విప్లవ స్ఫూర్తి
ఫిడేల్ కాస్ట్రోకు
కుడి భుజంగా నిలిచి
సోషలిస్టు క్యూబన్ కలను
సాకారం చేసిన ఘనుడివి !
ప్రపంచపటంలో పూసిన
చిన్ని ఎర్రమందారం క్యూబాను
సామాజిక ఆర్థిక
విద్య వైద్య రంగాల్లో
శిఖరాగ్రాన చేర్చిన మొక్కవోని
తిరుగుబాటు బావుటావు!
వైద్యం ప్రజల చెంతకు చేర్చి
ప్రపంచ సామాజిక వైద్యాన
అసలైన వైద్యులను సృష్టిస్తూ
నార్మన్ బేతూన్ కలల్ని
నిజం చేస్తున్న వెలుగు దిక్కు
కాస్ట్రో చే లు కలిసి నిర్మించిన
నేటి నవ క్యూబా నిర్మాతలు !
పదవులను త్యజించి సాటి
లాటిన్ అమెరికా దేశాల విముక్తికోసం
అలుపెరగని విప్లవ జ్వాలవై
బొలీవియా విముక్తి పోరాటాన
దుర్మార్గ C I A చేతిలో పాశవికంగా హత్యగావించబడిన విప్లవ వీరుడా
ఎర్నెస్టో చే గువేరా
నీకివే మా లాల్ సలాం !
గెరిల్లా పోరాట యోధుడా
నీ ఏబై ఆరవ వర్ధంతిన
అందుకో మా విప్లవాభినందనలు !
– డా. కె. దివాకరా చారి
Cell: 9391018972
– నేడు చెగువేరా 56వ వర్ధంతి