మీడియాలోని అతిపెద్ద విభాగం : సిద్దిఖీ కప్పన్
న్యూఢిల్లీ : ప్రధాన స్రవంతి మీడియాలోని అతిపెద్ద విభాగం కేంద్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల ఏజన్సీగా మారిపోయిందని కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్ పేర్కొన్నారు. మొదటిసారిగా ఆదివారం కోల్‌కతాలో ‘సీకింగ్ ది ట్రూత్ : జర్నలిజమ్ ఇన్ టుడేస్ ఇండియా’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ”ఏ విషయాన్ని మర్చిపోవద్దు. ఫాసిజాన్ని వ్యతిరేకించేందుకు ఒక సాధనం ఉత్తమంగా పనిచేస్తుంది. అదే జ్ఞాపకశక్తి. మనం ఎదుర్కొన్నవనీ గుర్తుంచుకోవాలి” అని అన్నారు.
మీడియాలోని అతిపెద్ద విభాగం ప్రభుత్వ ప్రజా సంబంధాల ఏజన్సీగా మారిపోయిందని అన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రెండూ కూడా ప్రకటనలపై ఆధారపడి ఉన్నాయని, ప్రభుత్వమే అతిపెద్ద ప్రకటనదారు కావడంతో మీడియాలోని అతిపెద్ద విభాగం కేంద్ర ప్రభుత్వ ఏజన్సీగా మారిపోయిందని అన్నారు.2020 అక్టోబర్ 5న తనను నిర్బంధించిన అనంతరం పోలీసులు, ఇతర ఏజన్సీల నుండి ఎదుర్కొన్న ప్రశ్నలను, అప్పటి రోజులను ఆదివారం వివరించారు. ”పాకిస్తాన్‌ను ఎన్నిసార్లు సందర్శించావు. బీఫ్ తింటారా, మీకు ఉర్దూ, అరబిక్ తెలుసా, మీరు జెఎన్‌యు నుండి వచ్చారా” అని పదేపదే ప్రశ్నలతో వేధించారని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడూ పంజాబ్‌ను దాటి వెళ్లలేదని, బీఫ్, ఫోర్క్‌లతో పాటు అన్ని రకాల మాంసాహారం తింటానని, తనకు కొంచెం ఉర్దూ తెలుసునని, తాను జెఎన్‌యు ప్రవేశపరీక్ష రాయలేదని చెప్పానని అన్నారు. అరెస్ట్ అనంతరం 21 రోజుల పాటు మదుర పాఠశాలలో నిర్బంధంలో ఉంచారని, అదే తాత్కాలిక జైలు, క్వారంటైన్ సెంటర్‌గా మారిందని అన్నారు. అయితే ఆ గదిలో తనతో పాటు 50 మంది ఉండేవారని చెప్పారు. 45రోజుల నిర్బంధం తర్వాత మొదటిసారి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించారని చెప్పారు. హిందీ లేదా ఇంగ్లీషులో మాట్లాడాలని కేవలం ఐదు నిమిషాలు సమయం ఇచ్చేవారని, తన తల్లికి మలయాళం మాత్రమే వచ్చని చెప్పడంతో రెండు నిమిషాలు సమయం ఇచ్చారని అన్నారు.అరెస్ట్ సమయానికి సిద్దిఖీ కప్పన్ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉన్నారు. 2020 డిల్లీ అల్లర్ల నుండి బెంగళూరు జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య వరకు అనేక సమస్యలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కి వ్యతిరేంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో తాను కేంద్ర ఏజన్సీల, ఢిల్లీ పోలీసుల నిఘాలో ఉన్నానని, దీంతో తనను టార్గెట్ చేశారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతిపై పెత్తందారులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రిపోర్టింగ్‌కు వెళుతున్న కప్పన్‌ను మదురలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ లేకుండా 28 నెలల పాటు ఉత్తరప్రదేశ్ జైలులో బంధీగా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలయ్యారు.