పోరాటాల ఫలితంగానే

వికలాంగుల పెన్షన్‌ పెంపు :ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వికలాంగుల పెన్షన్‌ను రూ. 10వేలకు పెంచాలంటూ ఎన్‌పీఆర్‌డీ నిర్వ హించిన దశల వారీగా పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం పెన్షన్‌ను పెంచిం దని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్‌, ఏం అడివయ్యా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో గ్రామ స్థాయిలో రెండు నెలల పాటు ఇదే డిమాండ్‌పై ఉద్యమాలు నిర్వహించామని వారు గుర్తు చేశారు.
ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ వికలాంగుల పెన్షన్‌ను రూ. వెయ్యిమేరకు పెంచుతున్నామని ప్రకటించారని తెలిపారు. అందుకు హర్షం వ్యక్తం చేశారు.కానీ ఇప్పటివరకు రూ. 3016 పెన్షన్‌ మాత్రమే వస్తుందని తెలిపారు. మంచిర్యాల సభలో వచ్చే నెల నుంచి రూ. 4116 పెన్షన్‌ పంపిణీ చేస్తామంటూ ప్రకటించారని వివరించారు.సీఎం ప్రకటన గందరగోళానికి గురి చేసే విధంగా ఉందని పేర్కొన్నారు. నామమాత్రంగా పెన్షన్‌ పెంచి చేతులు దులుపుకోవడం సరైంది కాదనీ, రూ. 4116తో కుటుంబాల పోషణ ఏవిధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పెన్షన్‌ పెంచి వికలాంగుల ఓట్లు పొందేందుకు సీఎం ప్రకటన దోహదం చేస్తున్నదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులకు పెన్షన్‌ను రూ. 10వేలకు పెంచే వరకు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.