ఆశా వర్కర్లకు పారితోషకం రూ.18,000 చెల్లించాలి

నవతెలంగాణ – బోనకల్‌
ఆశా వర్కర్లకు పారితోషకం 18000లకు పెంచి ఫిక్స్డ్‌ వేతనం నిర్ణయించాలని సిఐటియు మండల కన్వీనర్‌ బోయినపల్లి వీరబాబు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ముందు సమ్మె శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి మాట్లాడారు. ఆశా వర్కర్లు వైద్యరంగంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు. దీంతో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆశా కార్యకర్తలకు పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశ వర్కర్లకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం అయిదు లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షల ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపచేయాలని, ఏఎన్‌ఎం, జిఎన్‌ఎమ్‌ పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలని, వెయిటేజ్‌ మార్కుల నిర్ణయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మట్టి ఖర్చులకు 50 వేల రూపాయలు చెల్లించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని, టీబి స్పూటం డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలని, టీబి, లెప్రసి, కంటి వెలుగు తదితర పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని, వాలంటీర్లు ఏర్పాటు చేయాలని, ఆశలకు పని భారం తగ్గించాలని, జాబు చార్ట్‌ ను విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు రామన సరోజినీ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సమయంలో సమ్మె నిలిపివేస్తే ఆశా కార్యకర్తల సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ విధంగా ప్రభుత్వ మాటలను నమ్మి సమ్మెను నిలిపివేశామని తెలిపారు. కానీ సమ్మె నిలిపివేసి సంవత్సరాలు గడుస్తున్న తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదని మరో మార్గం లేక సమ్మెలోకి వెళ్ళామని తెలిపారు. ఈ సమస్యపురంలో ఆశా వర్కర్లు రామన సరోజిని, మరీదు లీలా కుమారి, కొంగల వెంకటరమణ, నక్కల నారాయణమ్మ, ఇరుగు జయమ్మ, కొమ్మ గిరి నాగేంద్రమ్మ, తులసి ముల్లపాటి ప్రమీల, కన్నెపోగు వెంకటరమణ పాల్గొన్నారు.
కల్లూరు : ఆశా వర్కర్లకు కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమల విఠల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె వారానికి రెండో రోజు చేరుకుంది. ఈ సందర్భంగా విఠల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు సమాధానం, కె ప్రభావతి, యు తులసి, కే.సుగుణ, వసంత, ఏ.జామలమ్మ తదితర ఆధ్వర్యంలో జరిగింది.
ఖమ్మం రూరల్‌ : ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం ఖమ్మం రూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మండల పరిధిలోని పెద్దతండాలో ఆశా కార్యకర్తల సమ్మె శిబిరాన్ని మంగళవారం సందర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్‌ రెడ్డి, సీఐటీయూ నాయకులు పి.మోహన్‌ రావు, మెడికొండ నాగేశ్వరరావు, ఏర్పుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తల్లాడ : మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలకు సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అయినల రామలింగేశ్వర రావు, రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌, చల్ల నాగేశ్వరరావు, మేడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్‌ : ఆశా వర్కర్లు రెండో రోజు వైరా పట్టణంలో సమ్మె కొనసాగించారు. సమ్మెకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు వైరా పట్టణ కన్వీనర్‌ అనుమోలు రామారావు, జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.