ఆదివారం వరకే అసెంబ్లీ సమావేశాలు : బీఏసీలో నిర్ణయం

 Assembly meetings till Sunday: Decision in BACనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారం వరకే కొనసాగనున్నాయి. అదే రోజు మరోసారి బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై…అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినరు భాస్కర్‌, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో మూడు, నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించింది. కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించింది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయనీ, వాటన్నింటినీ చర్చించేందుకు వీలుగా సమావేశాలను కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. దేశంలోనే అతి తక్కువగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వివరించారు. హరీశ్‌రావు స్పందిస్తూ, ఎన్ని రోజులు నిర్వహించార న్నది ముఖ్యం కాదనీ, ప్రజా సమస్యలపై ఎన్ని గంటలపాటు చర్చించామ న్నదే ముఖ్యమని గుర్తు చేశారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయా పార్టీలు స్పీకర్‌కు ప్రతిపాదనలు అందించాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలు, సంక్షేమ పథకాలపై సభలో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. దాదాపు 10 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజ న్‌ వెనక్కి పంపిన నాలుగు బిల్లులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు, టిమ్స్‌ ఆస్పత్రులు, జీఎస్టీ చట్ట సవరణ, కార్మికశాఖకు సంబంధించిన బాయిలర్స్‌ చట్ట సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. శుక్రవారం వరదలపై చర్చ, 5న బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. 6న శాసనసభ సమావేశాలు ముగించనున్నారు.