లాలూ కుటుంబానికి చెందిన రూ. 6 కోట్ల ఆస్తులు జప్తు

న్యూఢిల్లీ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నాయకులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి చెందిన రూ. 6 కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఇడి జప్తు చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి. అయితే ఎన్ని ఆస్తులను జప్తు చేశారు, వాటి ఖచ్చితమైన విలువ ఇంకా వెల్లడి కాలేదు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2009 వరకూ లాలూ ప్రసాద్‌, ఆయన కుటుంబ సభ్యులు , అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చి వారి వద్ద నుంచి అతి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదయింది. ముందుగా ఈ కేసులో సిబిఐ విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఇడి దర్యాప్తు చేస్తోంది.