తాండూరులో అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర జాతి ఖ్యాతికీ ప్రతిరూపం
రాష్ట్ర అవతరణ దినోత్సవం
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ రాష్ట్ర జాతి ఖ్యాతికి ప్రతిరూపం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా పట్టణ కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. అదేవిధంగా పట్టణంలో నిర్మాణం కానున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. దేశ భవిష్యత్తులో దేశ చరిత్రలో మరో నూతన అధ్యాయం జూన్‌ 02 ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు కోట్లాది ప్రజల కోరిక నెరవేరిన తరుణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం 10 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ నాయకత్వంలో అభివృద్ధిలో దేశంలోని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌ది అని రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న పరిమల్‌, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రాజు గౌడ్‌, ఆర్డీవో అశోక్‌ కుమార్‌, డి.ఎస్‌.పి శేఖర్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ సింగ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ విజరు దేవి, శోభ రాణి, నీరజ బాల్రెడ్డి, వెంకన్న గౌడ్‌, అస్లం, సంగీత ఠాగూర్‌, నాయకులు నర్సింలు, శ్రీనివాస్‌ చారి, రాజన్‌ గౌడ్‌, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.