ఏఐఎస్‌ఎఫ్‌ సచివాలయ ముట్టడికి యత్నం

– విద్యాశాఖ ఆదేశాలను వెనక్కితీసుకోవాలి
– నాయకులపై చేయిచేసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావు
– వెంటనే సస్పెండ్‌ చేయాలని నేతల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌,హిమాయత్‌నగర్‌
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించింది. బుధవారం హైదరాబాద్‌లోని లిబర్టీ చౌరస్తా నుంచి బయలుదేరి సచివాలయం ముందు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. విద్యార్థులు, నాయకులు సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులను దొరికిని వారిని దొరికినట్టుగానే పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కొందరు నాయకులపై డీసీపీ వెంకటేశ్వరరావు చేయిచేసుకున్నారు. పోలీసులు భౌతికదాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలుపరుస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నీరుగార్చిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పారు. పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఇటిక్యాల రామకృష్ణ, రెహమాన్‌, గ్యార క్రాంతి, రఘురాం, నాగజ్యోతి, రాజు, బరిగేల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల దాడికి ఎస్‌ఎఫ్‌ఐ ఖండన
ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం సందర్భంగా పోలీసులు భౌతిక దాడికి పాల్పడడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోకి విద్యార్థి సంఘాలు, మీడియాకు అనుమతి లేదంటూ విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన అనధికారికంగా ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులపై డీసీపీ ఉద్దేశ పూరితంగా భౌతిక దాడి చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మానవ హక్కులు హరించేలా వ్యవహరించిన డీసీపీ వెంకటేశ్వర్లుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల గుండాగిరి మానుకోవాలి : పీడీఎస్‌యూ
విద్యార్థి సంఘాల నేతలపై పోలీసుల గుండాగిరిని మానుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి మహేష్‌, ఎస్‌వి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులపై దాడి చేసిన డీసీపీ వెంకటేశ్వర్లును వెంటనే డిస్మిస్‌ చేయాలని కోరారు.
ప్రజాస్వామిక చర్యలకు పీడీఎస్‌యూ ఖండన
ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులపై పోలీసులు భౌతికదాడికి పాల్పడడం, అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్‌ ఖండించారు.