ఆసీస్‌, సఫారీ ఢీ

ఆసీస్‌, సఫారీ ఢీ– ఈడెన్‌లో నేడ  రెండో సెమీస్‌ పోరు
కోల్‌కత : ఐసీసీ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరు. ఎన్నో అంచనాలు, ఒత్తిడితో కూడిన ఇటువంటి మ్యాచ్‌కు రెండు విధాలుగా సన్నద్ధం కావచ్చు!. కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధం కావటం లేదా ఇది కూడా మరో మ్యాచ్‌ అంతే.. అని సన్నద్ధం అవటం. ఇందులో ఏ మార్గం విజయానికి చేరువ అని ఎవరూ చెప్పలేరు. ఐదుసార్లు ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా నాకౌట్‌లో ఎదురులేని రికార్డుతో దీమాతో కనిపిస్తుండగా, ప్రపంచకప్‌ నాకౌట్‌లో అదృష్టం కలిసిరాని జట్టుగా చరిత్రలో నిలిచిన దక్షిణాఫ్రికా ఈసారి మునుపటి లెక్క ఉండదంటూ పట్టుదల ప్రదర్శిస్తోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నేడు ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో తలపడనున్నాయి. గ్రూప్‌ దశ మ్యాచ్‌ సహా ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా నేడు సెమీస్‌లో అదే స్ఫూర్తితో బరిలోకి దిగుతోంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌లు భారీ శతకాలతో ఆసీస్‌ శిబిరంలో సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆసీస్‌ సైతం అత్యంత బలమైన జట్టుగా నిలిచింది. సఫారీలకు డికాక్‌, మార్క్‌రామ్‌, వాండర్‌ డసెన్‌, మార్కో జాన్సెన్‌, కగిసో రబాడ కీలకం కానుండగా.. ఆస్ట్రేలియాకు మాక్స్‌వెల్‌, వార్నర్‌, మార్ష్‌, కమిన్స్‌, జంపాలు కీలకం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిని గమనంలో ఉంచుకుని టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపనుంది!.