వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

అక్రమాలను నిరూపిస్తే ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం
జడ్పి వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
మతాన్ని పెంచి పోషించే పార్టీ బిజెపి అని పచ్చని గ్రామాల్లో మత చిచ్చు పెట్టె ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఉందని జడ్పి వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సాయవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ కానీ ఆయన కుమారులు కానీ అవినీతి పాల్పడినట్లు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని, లేదంటే బిజెపి కాంగ్రెస్‌ నాయకులు షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో ముక్కు భూమికి రాయాలని సవాల్‌ విసిరారు. స్థానిక బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు తమ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యే పదవి, వయసు, హౌదా తెలియకుండా ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీలో బీసీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏనాడు ఏలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా రాత్రింబవళ్లు అభివృద్ధి సంక్షేమం కోసమే పరితపిస్తున్న ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే అంజయ్య అని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యను అభివృద్ధిలో ప్రశ్నించకుండా కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన కుమారులపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి లంచం ఎమ్మెల్యే తీసుకున్నా, ఆయన కుమారులు అక్రమాలకు పాల్పడినట్టు తమకు నిరూపించాలని వెంటనే ఎమ్మెల్యే అంజయ్యతో తామే రాజీనామా చేయిస్తామని అన్నారు. విమర్శలు ఆమోదయోగ్యంగా ఉండాలని అప్పుడే ప్రతి విమర్శలు కూడా అర్థవంతంగా ఉంటాయని, కానీ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ నీచ రాజకీయం చేస్తున్నారని వారు అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు పేద ప్రజల కోసం షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 1760 ఇండ్లను కట్టించారని అదేవిధంగా నందిగామలో 60, తిమ్మాపూర్‌ వద్ద మరో 20 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గుర్తు చేశారు. కార్యయక్మంలో ఎంపీపీ ఇద్రిస్‌ జెడ్పిటిసి వెంకట్‌ రాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నటరాజన్‌, కౌన్సిలర్లు వెంకట్‌ రాం రెడ్డి, సర్వర్‌ పాషా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గనూరు విశ్వం, మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయక్‌, గుండుబావి శ్రీనివాస్‌ రెడ్డి,గ్రంధాలయం చైర్మన్‌ లక్ష్మీనరసింహారెడ్డి, పెంటనోళ్ల యాదగిరి, హరికృష్ణ, జూపల్లి శంకర్‌, పిల్లి శేఖర్‌, అషు, నరహరి తదితరులు పాల్గొన్నారు.