– హెల్త్ అసిస్టెంట్ ఏఎన్‌ఎంను నియమించాలి
– డాక్టర్లకు మెడికల్ ఆఫీసర్ హోదా కల్పించాలి : తెలంగాణ ఇండియన్ మెడిసిన్ డాక్టర్ల సంక్షేమ సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో పనిచేస్తున్న ఆయుష్ వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు, మంత్రులకు సమస్యల గురించి చెప్పినా వారిది అరణ్యరోదనగా మిగిలింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇండియన్ మెడిసిన్ డాక్టర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ పి సత్యం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 24×7 వైద్య సేవలను 25 ఏండ్ల నుంచి విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యాసంస్థలో ఒక హెల్త్ అసిస్టెంట్ ఏఎన్‌ఎం లేదా ఎంపీహెచ్‌డబ్ల్యూ అర్హత ఉన్న వారిని నియమించాలని కోరారు. అర్హత కలిగిన డాక్టర్లకు హెల్త్ సూపర్‌వైజర్‌గా కాకుండా మెడికల్ ఆఫీసర్ హోదా కల్పించాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదని స్పస్టం చేశారు. ప్రతి జిల్లాలో డీసీవోల మాదిరిగా జిల్లా ఆరోగ్య అధికారి డిప్యూటేషన్ ఇవ్వాలని తెలిపారు. రీజినల్ లేదా జోనల్ స్థాయిలో ఆర్‌హెచ్‌ఎస్‌వో లేదా జోనల్ హెల్త్ ఆఫీసర్ నియమించాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మాదిరిగా పేస్కేళ్లను వర్తింపచేయాలని కోరారు. ఆర్‌హెచ్‌ఎస్‌వోలను ప్రతి రీజినల్‌లో ఇచ్చి అవసరమైతే సాంఘిక సంక్షేమ శాఖతోపాటు బీసీ, గిరిజన, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకూ వైద్య సేవలను పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. తమ సర్వీసులను ఆయుష్ శాఖలో లేదంటే వైద్య శాఖలోకి విలీనం చేయాలని కోరారు. డాక్టర్లను డాక్టర్లుగా గుర్తించి న్యాయం చేయాలని తెలిపారు.