– గంగుల ఎన్నికపై కేసులో ఉత్తర్వులు
నవతెలంగాణ -హైదరాబాద్
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ హై కోర్టులో బీజేపీ నాయకుడు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఆగస్టు 21కి వాయిదా పడింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజులపాటు బండి సంజయ్ ను కోర్టు కమిషనర్ క్రాస్ ఎగ్జామ్ చేయాలంది. గతంలోనే క్రాస్ ఎగ్జామ్ చేయాలని హైకోర్టు నిర్ణయిస్తే.. ఎంపీగా ఉన్నందున పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని బండి సంజయ్ చెప్పడంతో ఇప్పుడు ఆ తేదీలను నిర్ణయిం చింది. ఈ మేరకు జస్టిస్ సీహెచ్ సుమలత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో ఏర్పాటు చేసిన అడ్వకేట్ కమిషన్ క్రాస్ ఎగ్జామ్ చేయాలనీ, దాని రిపోర్టును సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ ఆగస్ట్ 21కు వాయిదా వేశారు.
శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై కేసు 7కి వాయిదా
రాష్ట్ర మంత్రి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ రాఘవేంద్రరాజు చేస్తున్న ఆరోపణలకు సాక్షులు, సాక్ష్యాలు సమర్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే మాదిరిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు శ్రీనివాస్‌గౌడ్ వేసిన అఫిడవిట్లను పరిశీ లించి విచారణ చేస్తామంది.
విచారణను ఆగస్టు 7కి వాయిదా వేస్తూ జస్టిస్ ఎం. లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆస్తులు, అప్పుల గురించి ఎలక్షన్ అఫిడవిట్‌లో అ సమగ్రంగా ఇచ్చారనీ, శ్రీనివాస్‌గౌడ్ తన భార్య పేరిట ఉన్న సాగు భూములు, బ్యాంకు లావాదేవీలు సమర్పించలేదనీ, ఒకసారి ఎలక్షన్ అఫిడవిట్ దాఖలు చేశాక రూల్స్‌కు వ్యతిరేకంగా దానిని వాపస్ తీసుకుని మళ్లీ ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై లోతుగా విచార ణ చేసి తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు.
ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త జడ్జీలు
నవతెలంగాణ -హైదరాబాద్
హైకోర్టుకు నూతనంగా నియమితులైన ముగ్గురితో అదనపు న్యాయమూర్తులుగా చీఫ్ జస్టిస్ అలోక్ అరధే సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. లాయర్ల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, లా ఆఫీసర్ల కోటా నుంచి సుజన కళాసికంలతో అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయించారు. వీళ్లంతా భగవంతుని సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలుత వీళ్లను జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన వారెంట్‌ను హైకోర్టు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జనరల్ చదివారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తుల (ఫుల్‌కోర్టు) సమావేశం జరిగింది. కొత్త జడ్జీల ఫ్యామిలీ మెంబర్స్, న్యాయాధికారులు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మెన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ చైర్మెన్ పల్లె నాగేశ్వర్‌రావు ఇతరులు హాజరయ్యారు. హైకోర్టు బార్ అసోసియేషన్‌లో కూడా ఆ ముగ్గురు కొత్త జడ్జీలకు సత్కారం జరిగింది.