అదరగొట్టిన ప్రభుత్వ బ్యాంక్‌లు

– రెట్టింపైన లాభాలు
– తొలి త్రైమాసికంలో రూ.35వేల కోట్లు
– అంచనాలకు మించి ఆదాయాలుొ ఎన్‌ఐఎంలో బిఒఎం టాప్‌

– తగ్గిన మొండి బాకీలు
హైదరాబాద్‌ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చాయి. ఆదాయ, లాభాల్లో అదరగొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో అన్ని పిఎస్‌బిలు స్థూలంగా రూ.34,774 కోట్ల నికర లాభాలు సాధించాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.15,306 కోట్ల లాభాలు ప్రకటించాయి. దీంతో పోల్చితే గడిచిన క్యూ1 లాభాల్లో రెట్టింపు పైగా ప్రగతిని సాధించాయి. అధిక నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్లు బ్యాంక్‌లకు ప్రధాన మద్దతును అందించాయి.
మొండి బాకీలు భారీగా తగ్గడం కలిసి వచ్చింది.
2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అధిక నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం) సాధించిన వాటిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) అగ్రస్థానంలో ఉంది. ఆ బ్యాంక్‌ ఎన్‌ఐఎం 3.86 శాతంగా చోటు చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో సెంట్రల్‌ బ్యాంక్‌ 3.62 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 3.61 శాతం చొప్పున ఎన్‌ఐఎంను నమోదు చేశాయి. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన క్యూ1లో పిఎస్‌బిల నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 26.3 శాతం వృద్థితో రూ.99,114 కోట్లకు చేరాయి. రుణాల జారీలో 16 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిపాజిట్లు 13.2 శాతం వృద్థి చోటు చేసుకుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) రికార్డ్‌ స్థాయిలో వృద్థిని నమోదు చేసింది.