– టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో విద్యుత్‌తో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి ప్రజలకు సూచించారు. విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382071574, 7382072106, 7382072104 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనికి తోడు సంస్థ మొబైల్ యాప్, వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వానాకాలం ముగిసేవరకూ ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్, సూపరిండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాతావరణంలో వస్తున్న మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలనీ, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి 345 కరెంట్ స్తంభాలు విరిగిపోయాయనీ, వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంత వర్షమున్నప్పటికీ ఎక్కడ కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నామని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. ఇంజినీర్స్, ఇతర అధికారులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాల ని ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.
ప్రజలకు సీఎండీ సూచించిన జాగ్రత్తలివే
8వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా వాటివైపు వెళ్లనీయొద్దు.
రోడ్లమీదగానీ, నీటిలో కాని విద్యుత్ తీగ పడి ఉంటే తొక్కకూడదు. వాటి మీద నుంచి వాహనాలు నడపరాదు. ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలి.
విద్యుత్ స్తంభాలను, స్టే వైర్ల ను తాకరాదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి విద్యుత్ ప్రవాహకాలైన లోహపు రాడ్లను ఉపయోగించకుండా చెక్క/ ప్లాస్టిక్‌తో చేసిన పైప్‌లను మాత్రమే వాడాలి.
చెట్ల కొమ్మలు, వాహనాలు, భవనాలపై తెగి పడ్డ తీగలుంటే అప్రమత్తంగా ఉండాలి.
భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులున్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలపాలి.
విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన యూఎస్‌సీ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
లోతట్టు ప్రాంతాలు, ముంపునకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా నున్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలపాలి.
అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్లల్లోని మీటర్ల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి వాటిని పై పోర్షన్‌లో పెట్టుకోండి. ఇంకా సెల్లార్‌ల్లో ఉన్న మీటర్లను పై పోర్షన్‌లలోకి పెట్టేందుకు విద్యుత్ సిబ్బందిని సంప్రదించండి.
24 గంటలూ అందుబాటులో కంట్రోల్ రూమ్
టీఎస్‌ఎన్పీడీసీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఒక్క సర్కిల్ పరిధిలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు అధికారులను ఆదేశించారు. డైరెక్టర్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల పై అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క స్టాఫ్ విధిగా హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ సేవలందించాలని ఆదేశించారు. అత్యవసరంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలలో విద్యుత్ సంస్థకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సత్వర చర్యలు తీసుకుంటూ నష్టం వాటిల్లకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంతాలైన భద్రాచలం, భూపాలపల్లి, మంథని పరిసర ప్రాంతల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడా విద్యుత్ అంతరాయాలు లేకుండా సరఫరా అందించాలని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల వెహికల్ ను సిద్ధంగా పెట్టుకోవాలని తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 కు ఫోన్ చేయాలని సూచించారు. సమీక్షలో డైరెక్టర్లు బి. వెంకటేశ్వర రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, ఇన్‌చార్జి డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సీజీఎంలు, 16 సర్కిళ్ల ఎస్‌ఈలు పాల్గొన్నారు.